గుంతకల్లు అభివృద్ధిని గాడిలో పెట్టేరా ?

        అనంతపురం ప్రతినిధి : గుంతకల్లు అంటేనే ఒకప్పుడు అభివృద్ధికి నిలయంగా ఉండేది. ఒకవైపు రైల్వే డివిజన్‌తోపాటు, మరోవైపు ఉపాధి పరిశ్రమలు అనేకముండేవి. అటువంటిది క్రమంగా అన్నీ మూతపడుతూ రావడంతో గుంతకల్లు అభివృద్ధి పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు ఉంటోంది. అన్ని చోట్లా పాత పరిశ్రమలతోపాటు కొత్తవి వచ్చి చేరుతున్నాయి. కాని ఇక్కడ మాత్రం ఉన్న పరిశ్రమలు మూతపడి కనిపంచకుండా పోతున్నాయి. వాటిని తెరిపిస్తామని పాలకులు ప్రతి ఎన్నికల ముందు ఇచ్చే హామీగా ఉంటోంది.. తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. తెరచుకోని స్పిన్నింగు మిల్లుఅసియాలోనే అతిపెద్ద స్పిన్నింగ్‌ మిల్లు గుంతకల్లు స్పిన్నింగ్‌ మిల్లు. 1352 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. 1954లో ఈ పరిశ్రమ ప్రారంభమైంది. సహకార రంగంలో ఏర్పాడిన ఈ పరిశ్రమ 1991లో మూతపడింది. ఈ పరిశ్రమను తెరిపిస్తామని ఎన్నికల సమయంలో పార్టీలు హామీలను ఇస్తూనే ఉన్నారు. అంతకు మునుపు చంద్రబాబునాయుడు ఇవ్వగా, 2018లో పవన్‌కళ్యాణ్‌ దీన్ని పరిశీలించారు. ఆ తరువాత వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి కూడా తెరిపిస్తామని హామీనిచ్చారు. 2019 వైసిపి అధికారంలోకి వచ్చాక కూడా కొంత మంది అధికారులు దీన్ని తెరిపిస్తామని పరిశీలనలు చేశారు. ఇప్పటికీ దీనిపై ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఈ ఎన్నికల సమయంలోనైనా దీనిపై నిర్ధిష్టమైన హామీ ఏదైనా లభిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఇంతటి భారీ పరిశ్రమే కాకుండా పారిశ్రామికవాడలోనున్న అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఇక రైల్వే శాఖకు సంబంధించి కూడా స్లీపర్‌ కోచ్‌ పరిశ్రమ మొదలుకుని అనేక ఉపాధి కల్పించేవి మూతపడ్డాయి. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. ప్రధానంగా తాగు, సాగునీటి సమస్యలూ ఉన్నాయి. గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉంది. సాగునీటికి సంబంధించి హంద్రీనీవా నుంచి అన్ని చెరువులకు నీటిని అందించే కార్యక్రమం పూర్తవలేదు. గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌, గుత్తి బ్రాంచ్‌ కెనాల్‌ ఉన్నా పూర్తి స్థాయిలో నీటిని అందించలేని స్థితిలోనున్నాయి. వాటి ఆధునీకరణ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయి ఉన్నాయి. దీంతో సాగునీటి కష్టాలు అదే స్థాయిలోనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా చర్చకొచ్చేనా…ఈ ఎన్నికల్లోనైనా ఈ సమస్యలను పరిస్కారం చూపిస్తామన్న హామీ ఏదైనా లబిస్తుందా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైసిపి తరుపున ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డియే బరిలో ఉన్నారు. టిడిపి తరుపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం బరిలోనున్నారు. రాజకీయాల్లో ఈ ఇద్దరు నేతలు ఉద్దండులే. ఇలాంటి నాయకులు ఈ నియోజకవర్గం అభివృద్ధిపై ఏ మేరకు దృష్టి సారిస్తారన్నది చూడాల్సి ఉంది.

➡️