మెస్ కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి

Dec 2,2023 14:47 #Kakinada
ggh mess workers protest for pending wages

కట్ చేసిన పీఎఫ్ సొమ్ము ఖాతాలకు జమ చేయాలి

ప్రజాశక్తి-కాకినాడ : మెస్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జిజిహెచ్ తల్లి బిడ్డ విగ్రహం సమీపంలో ఉన్న గేటు వద్ద కార్మికులు శనివారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై శంకర్, ఏ ఏడుకొండలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు వేడి వేడి ఆహార అందించడంలో మెస్ కార్మికులు ఎంతో శ్రమ పడుతున్నారని అటువంటి కార్మికులకు రెండు నెలల కాలం నుంచి కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. గత ఎనిమిది నెలల కాలం నుంచి కార్మికుల షేర్ పిఎఫ్ వాటాను దాదాపు 7 లక్షల వరకు సొమ్ము కట్ చేసుకుని పీఎఫ్ ఖాతాకు జమ చేయకుండా కాంట్రాక్టర్ వద్ద పెట్టుకున్నారని అన్నారు. ఈ కాంట్రాక్టర్ కాలపరిమితి 2024 ఏప్రిల్ నెలతో ముగియనుందని ఈయన కట్ చేసిన సొమ్ము పిఎఫ్ ఖాతాకు జమ చేయకపోతే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి అని అన్నారు. నాలుగు నెలల క్రితమే కార్మికుల డిమాండ్లను రాతపూర్వకంగా కాంట్రాక్టర్ కి ఇచ్చి ఉన్నారని నేటికీ ఆ డిమాండ్స్ పై చర్చలు జరపకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ విషయాల మీద ఇప్పటికే లేబర్ అధికారులకు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపర్డెంట్ కి విన్నవించడం జరిగిందని తెలియజేశారు. డైట్ సెక్షన్లో కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి అథారిటీ కలిగినటువంటి వ్యక్తి ఎవరిని ఇక్కడ పెట్టకుండా కేవలం ఫోన్లు ద్వారానే పనులు నడిపిస్తూ కాంట్రాక్టర్ కంటికి కనబడకుండా పనులు చేయిస్తున్నారని స్థానికంగా కార్మికులుకు సమస్య వస్తే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితని అన్నారు. తక్షణమే మెస్ కార్మికుల సమస్యలపై జిల్లా అధికారులు కలగజేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వై శ్రీను, ఎస్ శ్రీను, సురేష్, విజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

➡️