‘వందేభారత్‌ ‘ పెరుగులో ఫంగస్‌

Mar 6,2024 11:03 #Vande Bharat train

 ప్రయాణీకుడు ఫిర్యాదు

న్యూఢిల్లీ : హైస్పీడ్‌ వందే భారత్‌ రైలుపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నా ..ఈ రైళ్లలోని భోజన సదుపాయలపై తరచూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా ప్రయాణికుడు హర్షద్‌ తోప్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. హర్షద్‌ మంగళవారం డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌విహార్‌కు బయలుదేరాడు. రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనంలో వడ్డించిన పెరుగులో ఫంగస్‌ ఉండడంతో షాక్‌కి గురయ్యాడు. పాడైన పెరుగు ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. వందే భారత్‌ నుంచి ఇలాంటి నాసిరకం సేవలను ఆశించడం లేదని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర రైల్వే, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికార ఖాతాలకు ట్యాగ్‌ చేశాడు. వైరల్‌గా మారిన ఈ పోస్టుపై భారత రైల్వే స్పందించింది. అతని ప్రయాణ వివరాలను తెలియజేయాలని.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తామని బదులిచ్చింది.మరోవైపు ఉత్తర రైల్వే కూడా ఈ పోస్టుపై స్పందించిస్తూ.. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యాన్ని పరిశీలించాల్సిందిగా ఇండియన్స్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌కు ట్యాగ్‌ చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత నెల దిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి నాసిరకమైన భోజనాన్ని అందించారు. భోజనం సరిగా లేనందుకు తాను చెల్లించిన మొత్తాన్ని రిఫండ్‌ చెల్లించాలని రైల్వే శాఖను కోరాడు. అంతకుముందు మరో ప్రయాణికుడి భోజనంలో బొద్దింక రావడంతో చర్చనీయాంశంగా మారింది.

➡️