అంగన్‌వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Dec 23,2023 10:35 #agricultural

ప్రత్యక్ష పోరాటాల్లోకి వ్యవసాయ కార్మికులు

 వ్యవసాయ కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికుల పిల్లలకు తల్లులుగా సేవలందించే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగుతామని హెచ్చరించాయి. గురువారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో రెండు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. బికెఎంయు రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాలతోపాటు కెవిపిఎస్‌, వృత్తిదారుల సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు కె రామాంజనేయులు, కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు నటరాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి రాణి, కోట కల్యాణ్‌, అంగన్‌వాడీల సంఘం నాయకులు దేవి మాట్లాడారు. అంగన్‌వాడీల పట్ల కేంద్రం కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితో వుందన్నారు. గర్భిణులకు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించే ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు తగ్గించడం తగదన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం అనంతరం ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమానికి హాజరై మద్దతు ప్రకటించారు. పలు యూనియన్ల మద్దతుసమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలకు ఎపి ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌, ఎపి లారీ అండ్‌ మోటార్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ మేరకు ఇరు సంఘాల అధ్యక్షులు ఎన్‌ శివాజీ, జి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్‌పోర్టు కార్మికులను సమీకరించి జిల్లాల్లో సంపూర్ణ మద్దతు తెలిపి కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీల సమ్మెకు యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మద్దతు ప్రకటిస్తున్నట్లు యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి కె జగన్‌ మోహన్‌రావు తెలిపారు. సమ్మె డిమాండ్లను నెరవేర్చకుండా అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులకొట్టి, తోటి ప్రభుత్వ ఉద్యోగులను పావులుగా ఉపయోగించి ఉద్యోగుల మధ్య రాష్ట్ర ప్రభుత్వమే చిచ్చు పెట్టడాన్ని ఖంచిస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️