స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందపు డొల్లతనం

Dec 26,2023 07:18 #Editorial

విదేశీ వాణిజ్యం మీద ఏ విధమైన నియంత్రణా గనుక లేకపోతే దేశంలో నిరుద్యోగం పెరుగుతుందన్నది మూడవ ప్రపంచదేశాలు వలసలు గా ఉండిన కాలంలో చవిచూసిన అనుభవం. ఐనా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం చాలా మంచిది అన్న అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చేలా చాలా బూటకపు వాదనలను ముందుకు తెస్తున్నారు. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఈ తప్పుడు వాదనను ఆధారం చేసుకునే రూపొందాయి. తక్కిన దేశాలకంటే తమకు ఏ సరుకుల ఉత్పత్తిలో పైచేయి ఉండవచ్చునో అటువంటి సరుకుల ఉత్పత్తిలో ఆ దేశం ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించాలి అన్నదే ఆ వాదన

             ఎటువంటి నియంత్రణలూ లేని విధంగా ఒక దేశపు వాణిజ్యం ఇతర దేశాలతో సాగుతోందనుకుండాం. ఆ విధానం వలన ఆ దేశం రెండు రకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. మొదటిది: విదే శీ మారకం చెల్లింపులో లోటు. దిగుమతులద్వారా పొందగలుగుతున్న విదేశీ మారకం కన్నా ఎగుమతులకోసం చెల్లించవలసినదే ఎక్కువగా ఉండడం వలన ఈ సమస్య వస్తుంది. రెండవది: దిగుమతులతో దేశీయ ఉత్పత్తులు పోటీ పడలేని స్థితి రావడం వలన దేశీయ ఉత్పత్తి స్థాపక సామర్ధ్యం మేరకు జరగకుండా తగ్గిపోతుంది. దాని వలన దేశీయ వనరులు నిరుపయోగంగా ఉండిపోతాయి. ముఖ్యంగా నిరుద్యోగం పెరుగుతుంది. ఈ రెండు సమస్యలూ ఒకేమాదిరివి కావు. నిరుద్యోగం కేవలం దిగుమతులు ఎక్కువైపోయినందువలన మాత్రమే ఏర్పడదు. దిగుమతులకన్నా ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు: మన దేశం వలసపాలనలో ఉన్న కాలంలో విదేశీ ఉత్పత్తులు మన స్వదేశీ పరిశ్రమలను వృత్తులను దెబ్బ తీశాయి. దాని కారణంగా చేతివృత్తిదారులు, నైపుణ్యం కల పనివారు భారీస్థాయిలో తమ ఉపాధి కోల్పోయారు. ఐతే ఆ కాలంలో దిగుమతులకన్నా మన దేశం చేసిన ఎగుమతులే ఎక్కువ. ( ఆ విధంగా ఏర్పడిన మిగులును బ్రిటిష్‌ పాలకులు స్వాహా చేశారు) ప్రస్తుతం నేను విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుల్లో లోటు గురించి చర్చించబోవడం లేదు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య గురించి, స్వేచ్ఛా వాణిజ్యంతో దానికి ఉన్న సంబంధం గురించి చర్చిస్తాను.

విదేశీ వాణిజ్యం మీద ఏ విధమైన నియంత్రణా గనుక లేకపోతే దేశంలో నిరుద్యోగం పెరుగుతుందన్నది మూడవ ప్రపంచదేశాలు వలసలు గా ఉండిన కాలంలో చవిచూసిన అనుభవం. ఐనా ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం చాలా మంచిది అన్న అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం ఔతోంది. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చేలా చాలా బూటకపు వాదనను ముందుకు తెస్తున్నారు. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఈ తప్పుడు వాదనను ఆధారం చేసుకునే రూపొందాయి. తక్కిన దేశాలకంటే తమకు ఏ సరుకుల ఉత్పత్తిలో పైచేయి ఉండవచ్చునో అటువంటి సరుకుల ఉత్పత్తిలో ఆ దేశం ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించాలి అన్నదే ఆ వాదన. ప్రతీ దేశమూ తాను ఏ సరుకును బాగా ఉత్పత్తి చేయగలదో దానిమీదే కేంద్రీకరిస్తే అప్పుడు ప్రపంచం మొత్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువ సరుకులు ఉత్పత్తి అవుతాయి, ప్రతీ దేశమూ ఆ క్రమంలో ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతుంది. – ఇదే స్వేచ్ఛామార్కెట్‌ వాదన సారాంశం. ఇంతకు మించి వేరే ఇతర వాదనలు దానివద్ద ఏమీ లేవు.

ఇది పూర్తిగా చెత్త. ప్రతీ దేశమూ పూర్తి స్థాయిలో అందరికీ ఉపాధి కల్పిస్తున్నది అని, అందుచేత ప్రపంచం మొత్తం మీద పూర్తి స్థాయిలో ఉపాధికల్పన జరిగిందని ఈ వాదన ఊహిస్తుంది. అటువంటప్పుడు అంతకు ముందు చేసే పనులకు బదులుగా స్వేచ్ఛా వాణిజ్యం వచ్చాక వాళ్ళను ఇతర పనులకు మరలించడమే జరుగుతుంది తప్ప నిరుద్యోగం తలెత్తే సమస్యే ఉత్పన్నం కాదు అన్నది దాని తాత్పర్యం.

ఈ వాదన ప్రాతిపదికకు వాస్తవంలో గాని, సిద్ధాంతరీత్యా గాని ఎటువంటి ఆధారమూ లేదు. 1930 దశకంలోనే మైరేల్‌ కాలెక్కీ, జాన్‌మేనార్డ్‌ కీన్స్‌ ఈ స్వేచ్ఛావాణిజ్య సిద్ధాంతపు డొల్లతనాన్ని సైద్ధాంతికంగా ఎండగట్టారు. నిజానికి అంతకు 75 సంవత్సరాలకు మునుపే మార్క్స్‌ అటువంటి స్థితి వస్తుందని అంచనాకు వచ్చాడు. స్వేచ్ఛావాణిజ్యం ఒక దేశానికి ఎటువంటి హాని కలిగిస్తుందో ముందే స్పష్టంగా తేలిపోయింది.

దీనిని తేలికగా వివరించడానికి ఒక ఉదాహరణను తీసుకుందాం. మొత్తం ప్రపంచం ఉత్పత్తి సామర్ధ్యం 100 యూనిట్లు అనుకుందాం. ప్రపంచ మార్కెట్‌ మొత్తం డిమాండ్‌ 80 యూనిట్లు అనుకుంటే అప్పుడు మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 20 యూనిట్లు చెల్లకుండా మిగిలిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో డిమాండ్‌ ను బట్టే ఉత్పత్తి జరుగుతుంది గనుక 20 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం మేరకు పని జరగకుండా ఆగిపోతుంది. అలా మిగిలిపోయిన వనరులు ఆ యా దేశాలలో ఉండిపోతాయి.

ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. నిరుద్యోగాన్ని పెంచే పెట్టుబడిదారీ విధానంతో విసుగెత్తిపోతే కార్మికులు సోషలిజంవైపు మొగ్గు చూపుతారు కనుక పెట్టుబడిదారీ ప్రభుత్వమే జోక్యం కల్పించుకుని మార్కెట్‌ లో జోక్యం కల్పించు కుని డిమాండ్‌ పెరిగేలా, తద్వారా కార్మికులందరికీ ఉపాధి లభించేలా చూడాలని కీన్స్‌ సూచించాడు. ఒక దేశంలో ఆ విధంగా చేయగలిగేటప్పుడు యావత్తు ప్రపంచ స్థాయిలోనే అటువంటి ప్రయత్నం చేసి పూర్తి 100 యూనిట్ల ఉత్పత్తి మేరకు డిమాండ్‌ ను పెంచి తద్వారా పూర్తిస్థాయి ఉపాధికల్పన జరిగేట్టు చూడవచ్చుకదా ? అప్పుడ ఏ దేశంలోనూ ఉత్పత్తి వనరులు మిగిలిపోవు కదా ?

ఈ ప్రశ్నకు ఒకే ఒక, సూటి అయిన సమాధానం ఉంది. ఆ విధంగా జరగాలంటే ప్రపంచం మొత్తం ఒక రాజ్యంగా ఉండాలి. ప్రపంచం మొత్తం మీద ఒక ప్రభుత్వం ఉండాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండగా అటువంటిది జరగదు. అటువంటప్పుడు ఏ యే దేశాలలో ఉత్పత్తి సామర్ధ్యం పూర్తిగా వినియోగంలోకి రాకుండా ఉండిపోతుందో, ఆ యా దేశాల ప్రభుత్వాలు తమ మార్కెట్‌ డిమాండ్‌ ను పెంచడానికి, తద్వారా ఎక్కువగా ఉపాధి కల్పించడానికి పూనుకోవచ్చు. ఐతే స్వేచ్ఛావాణిజ్యం అమలులో ఉన్నందువలన, మార్కెట్‌ లో పెరిగిన డిమాండ్‌ ను కేవలం దేశీయంగా ఉత్పత్తి అయే సరుకులే అందుకుంటాయని చెప్పలేం. విదేశీ సరుకుల దిగుమతులు పెరిగి ఆ డిమాండ్‌ను తామే అందుకోవచ్చు. దానివలన ఆ దేశానికి దిగుమతులు పెరిగి వాణిజ్య లోటు భారం పెరుగుతుందే తప్ప తన ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం మాత్రం జరగదు. ఆ దేశాలు గనుక స్వేచ్ఛా వాణిజ్యం పరిధిలోకి లేకుండా ఉండివుంటే విచ్చలవిడి దిగుమతులను నిరోధించి దేశీయ సరుకుల డిమాండ్‌ ను, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చు. కాని, ఇప్పుడు స్వేచ్ఛావాణిజ్యం ఆ దేశాలను కట్టిపడేసింది.

ఇలా స్వేచ్ఛావాణిజ్యం కారణంగా ఆ యా దేశాలు తమ తమ మార్కెట్‌ డిమాండ్‌ ను, తద్వారా తమ దేశీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేలా జోక్యం చేసుకోలేని అశక్తతలోకి పడిపోయాయంటే దానర్ధం స్వేచ్ఛావాణిజ్యం వచ్చాక కలిగిన ఉపాధి అవకాశాలకన్నా, స్వేచ్ఛావాణిజ్యం లేకుండావుండి వుంటే రక్షణ చర్యలద్వారా ఎక్కువ ఉపాధిఅవకాశాలను కల్పించుకోగలిగి వుండేవి అన్నమాట. స్వేచ్ఛావాణిజ్య సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ప్రకారం ప్రతీ దేశమూ తనకు ప్రత్యేక సామర్ధ్యం కల సరుకులను ఉత్పత్తి చేయడం మీద కేంద్రీకరిస్తే అప్పుడు మొత్తం ప్రపంచ ఉత్పత్తి పెరుగుతుంది.అప్పుడు అన్ని దేశాలకూ లాభం ఒనగూరుతుంది. కాని మన పరిశీలనలో స్వేచ్ఛావాణిజ్యం అమలులోకి వచ్చాక అంతకు మునుపటి ప్రపంచ డిమాండ్‌ కన్నా తక్కువస్థాయికి డిమాండ్‌ పడిపోతుందని తేలింది.

అసలు స్వేచ్ఛావాణిజ్యం అమలులో ఉన్నప్పుడు ప్రపంచ స్థూల డిమాండ్‌ అనేది దేనిమీద ఆధారపడివుంటుంది? ప్రపంచ స్థూల డిమాండ్‌ ను ప్రాథమికంగా నిర్ణయించేది ప్రపంచం మొత్తం మీద అగ్రస్థానంలో ఉన్న పెట్టుబడిదారీ దేశం. ప్రస్తుతం అది అమెరికా. అమెరికా ఇప్పుడు డిమాండ్‌ ను సృష్టించడం విషయంలో చాలా ఎక్కువ స్వయంనిర్ణయాధికార శక్తి కలిగివుంది. అలా పెంచిన డిమాండ్‌లో కొంత భాగాన్ని ఇతర దేశాల ఉత్పత్తులు కాజేయవచ్చుగాక. అయినా అమెరికాకి ఏమీ బెంగ లేదు. ఎందుకంటే విదేశీ వాణిజ్య లోటు పెరిగిపోతుందనే భయం దానికి లేదు. డాలర్‌ ను బంగారంతో సమానంగా ప్రపంచం పరిగణిస్తూ తమ తమ డాలర్‌ నిల్వలను ఆ యా దేశాలు పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నంతకాలమూ అమెరికా కావలసినన్ని డాలర్లను ముద్రించుకోవచ్చు.

అందుచేత అమెరికాలోని వినిమయం + పెట్టుబడులు + ప్రభుత్వ వ్యయం కలిస్తే ప్రపంచ స్థూల డిమాండ్‌ ను నిర్ణయించే ప్రాథమికాంశంగా ఉంటుంది. అమెరికన్‌ ప్రభుత్వం చేసే వ్యయం మీద నియంత్రణ వేరే ఏమీ ఉండదు. కొళాయి ఇప్పినట్టు ఇప్పుకోవచ్చు. వర్తమాన పెట్టుబడిదారీ ప్రపంచంలో తక్కిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలపై సూపర్‌ ప్రభుత్వం మాదిరిగా ఒకమేరకు అమెరికా వ్యవహరించగలుగుతోంది. అంటే ఒక విధమైన ప్రపంచ ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తోంది.

ఐతే, ఈ విషయంలో ఇప్పుడు ఒక వైరుధ్యం తన ప్రభావాన్ని చూపడం మొదలుబెడుతోంది. ఎంతగా తక్కిన దేశాలమీద పెత్తనం చెలాయించగలుగుతున్నా, మౌలికంగా అమెరికా కూడా ఒక జాతిరాజ్యంగానే ఉంది. అందుచేత అమెరికన్‌ ప్రభుత్వం దేశీయ డిమాండ్‌ ను పెంచుకుంటూ పోతే, ఆ డిమాండ్‌ లో కొంత భాగం విదేశీ దిగుమతుల ద్వారా భర్తీ అవుతుంది. అప్పుడు అమెరికా వాణిజ్యలోటు పెరుగుతుంది. ఆలోటును అమెరికన్‌ ప్రభుత్వం భర్తీ చేయవచ్చు. కాని ఆ క్రమంలో అమెరికా ప్రభుత్వం అప్పులపాలవుతుంది. ఐనా ఆ దేశానికేమీ ఢోకా లేకపోవచ్చు. కాని అప్పులపాలౌతూ తన ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతూవుంటే దాని ఫలితంగా కలిగే ఉపాధిలో కొంత భాగం విదేశాలకు చెందుతోంది. ఇలా ఇతరదేశాలలో ఉపాధి కల్పన కోనం మనం ఎందుకు అప్పులపాలవ్వాలి? అన్న ప్రశ్న అమెరికాలో ఒక జాతీయ దృక్పథం నుంచి చూసినప్పుడు తలెత్తుతోంది. ఒక జాతి రాజ్యంగా తనకున్న బాధ్యతకు, అంతర్జాతీయంగా సూపర్‌ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదానికి మధ్య వైరుధ్యం తలెత్తుతోంది.

ఈ వైరుధ్యం ఇటీవల కొంత తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా కాలంలో తక్కిన సంపన్న దేశాల మాదిరిగానే అమెరికా కూడా తమ ప్రజానీకానికి సహాయం అందించడం కోసం భారీగా ద్రవ్యలోటు పెంచి వ్యయం చేసింది. కరోనా నెమ్మదించిన తర్వాత కాలంలో కూడా దేశీయ స్థూల డిమాండ్‌ ను పెంచడం కోసం ఆ భారీ ద్రవ్యలోటును కొనసాగించాలని చూసింది. కాని ఈ మధ్య తీవ్రంగా ద్రవ్యోల్బణం తలెత్తడంతో కొంత వెనక్కు తగ్గింది. ఐతే, ఈ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగానే మళ్ళీ ద్రవ్యలోటును పెంచడానికి పూనుకుంటుంది. ఐతే, ఈ మారు తమ దేశీయ డిమాండ్‌ పెరగడం ఇతర దేశాలలో ఉపాధిఅవకాశాల పెరుగుదలకు కాకుండా తమ దేశంలోనే పెరిగేవిధంగా కొన్ని రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రక్షణ విషయంలో చైనా పట్ల కొన్ని చర్యలు తీసుకుంది. ఇప్పుడు తక్కిన మూడవ ప్రపంచదేశాల విషయంలో కూడా అదేమాదిరిగా వ్యవహరించనుంది. ఈ ధోరణిని కొందరు ప్రపంచీకరణ-వ్యతిరేక క్రమం అంటూ అభివర్ణిస్తున్నారు. కాని అది సరైనది కాదు. సరుకుల దిగుమతి విషయంలో రక్షణ చర్యలకు అమెరికా పూనుకుంటోందే తప్ప ద్రవ్య పెట్టుబడి స్వేచ్ఛగా సంచరించే విషయంలో ఏ ఆంక్షలనూ విధించడం లేదు. పైగా మరేదైనా దేశం గనుక ద్రవ్య పెట్టుబడి కదలికలపై ఆంక్షలకు పూనుకుంటే అమెరికా ఆ దేశాన్ని శిక్షిస్తోంది. ఈ మాదిరి వైరుధ్యాలను అమెరికా పెద్దగా పట్టించుకోదు. తక్కిన అన్ని దేశాలకూ స్వేచ్ఛావాణిజ్యం గురించి గొప్పగా చెప్తుందే తప్ప తనవద్దకు వచ్చేసరికి మాత్రం అది రక్షణ విధానాన్నే పాటిస్తోంది కదా.

(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️