ఐడీబీఐ బ్యాంకులో రుణాల పేరుతో మోసం.. ఈడీ దర్యాప్తు

Dec 2,2023 15:58 #ED investigation

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి ఆధార్‌ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన నిందితులు.. ఐడీబీఐ బ్యాంకులో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. దాదాపు రూ.311.50 కోట్లను నిందితులు వారి సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ రుణాలతో సొంత వ్యాపారాలు, ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది నవంబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన స్థిర, చరాస్తులు సీజ్‌ చేశారు.

➡️