300 మంది భారతీయులున్న విమానాన్ని నిలిపేసిన ఫ్రాన్స్‌

Dec 23,2023 10:51 #flights, #France
  • మానవ అక్రమ రవాణాగా అనుమానం

పారిస్‌ : నికరాగువాకు చెందిన ఒక విమానం 300 మంది భారతీయ ప్రయాణీకులతో వెళ్తుండగా ఫ్రాన్స్‌ వైమానిక అధికారులు గురువారం అది ల్యాండ్‌ అయిన విమానశ్రయంలోనే నిలిపేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అనుమానించి ఈ విమానాన్ని నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) నుంచి ఈ విమానం టేకాప్‌ అయినట్లు గుర్తించారు. ఈ విమానంలో మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో విమానాన్ని ఆపేసినట్లు పారిస్‌ ప్రభుత్వ న్యాయవాది కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దేశ విద్రోహ నేర విభాగం (జునాల్కో) దర్యాప్తు చేస్తోందని పేర్కొంది. రోమానియన్‌ కంపెనీ లెజండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎ340 విమానం ఇంధనం నింపుకోవడానికి పారిస్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని వట్రీ విమానశ్రయంలో ల్యాండ్‌ అవ్వగా..అందులో మానవ అక్రమ రవాణాకు గురైన బాధిత ప్రయాణికులున్నట్లు గుర్తించి అక్కడే నిలిపేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే యుఎఇలో పనిచేసే 303 మంది భారతీయ ప్రయాణికులు విమానంలో ఉన్నారని, ఇంధనం నింపుకునేందుకు వట్రీలో ల్యాండ్‌ అయ్యిందని లెజండ్‌ ఎయిర్స్‌లైన్స్‌ తెలిపింది. కాగా ఇందులో ఉన్నవారిని సెంట్రల్‌ అమెరికాకు తీసుకెళ్లి అక్కడ నుంచి అమెరికా లేదా కెనడాకు చట్ట విరుద్ధంగా తరలించనున్నట్లు తెలిసింది. వీరందరినీ తొలుత విమానంలోనే ఉంచిన అధికారులు అనంతరం టెర్మినల్‌లోని ఒక భవనానికి తరలించి వేర్వేరుగా వసతి కల్పించారు. ప్రస్తుతం వట్రీ విమానశ్రయం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. సాధారణంగా చౌక ధరలకు టిక్కెట్లు లభించే బడ్జెట్‌ విమాన సర్వీసులు ఈ ఎయిర్‌ పోర్టు నుంచి నడుపుతుంటారు. మానవ అక్రమ రవాణా నేరానికి ఫ్రాన్స్‌లో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయి.

➡️