కాంగ్రెస్‌ నుంచి పోటీ

  •  చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) : టిడిపి, వైసిపిలతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, తన వ్యక్తిగత అభిప్రాయాలు, నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లిలోని తన స్వగృహంలో కార్యకర్తలు, నాయకులతో ఆయన మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ..టిడిపిలో తనకు సముచిత స్థానం అందించి ఎంతో గౌరవించారని, అది చిరస్థాయి వరకు నిలిచి ఉంటుందన్నారు. పర్చూరు వైసిపి అభ్యర్థిగా ఉండాలని సిఎం జగన్‌ పట్టుబట్టారని, చీరాల నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా నాయకులు, కార్యకర్తల నిర్ణయం మేరకు తాను వైసిపికి రాజీనామా చేశానని అన్నారు. తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రయాణిస్తూ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పారు. త్వరలోనే పార్టీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిలతో సంప్రదించి చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అధికారికంగా పార్టీలో చేరతానని తెలిపారు. పోలీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. చిన్న పొరపాటు చేసినా వారు ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని అన్నారు. సభలో వేటపాలెం, చీరాల జడ్‌పిటిసి సభ్యులు బండ్ల తిరుమల దేవి, ఆకురాతి పద్మిని పాల్గొన్నారు.

➡️