ఆహారం కలుషితం..36 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 19,2024 20:25 #Food Poisoning, #school

ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు) : కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో మొత్తం 314 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 36 మంది విద్యార్థులకు సోమవారం తెల్లవారుజాము నుంచి రెండు నుంచి మూడు సార్లు విరేచనాలు, వాంతులు కావడంతో వార్డెన్‌ నవీన్‌ అప్రమత్తమై స్థానిక పిహెచ్‌సికి సమాచారం అందించారు. పిహెచ్‌సి వైద్యాధికారి గాయత్రి అధ్వర్యంలో వసతి గృహంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరు విద్యార్థులు గౌతమ్‌, హరికృష్ణలను మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులు రామ్‌కుమార్‌, విష్ణు జ్వరంతో బాధపడుతుండడంతో వారిని జీలుగుమిల్లి పిహెచ్‌సికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. కలుషిత ఆహారం తినడం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఐటిడిఎ ఎపిఒ పివిఎస్‌ నాయుడు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ మేరీ కేథరిన్‌ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను, తాగునీటిని పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్‌ ఆర్‌వి వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ కెఎం మంగతాయారు, ఎంఇఒలు కె శ్రీనివాస్‌, బుచ్చయ్య, ఎటిడబ్ల్యుఒ కృష్ణమోహన్‌, సిహెచ్‌ఒ శ్రీనివాసరాజు ఉన్నారు.

➡️