రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు

Mar 29,2024 10:25 #floods, #temparature
  • అప్రమత్తంగా ఉండండి
  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండలు తీవ్రమయ్యాయి. గురువారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే విజయవాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మానాథ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎండ తీవ్రతతోపాటు వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా వుంటుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. రాష్ట్రంలోని 42 మండలాల్లో శుక్రవారం, మరో 44 మండలాల్లో శనివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని 18 మండలాలు, నంద్యాల 8, పార్వతీపురం మన్యం 8, ఎన్‌టిఆర్‌ జిల్లా ఆరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక్కొక్క మండలంలో వడగాడ్పులు వీచే అవకాశం వుందన్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఎండ తీవ్రమవ్వకముందే తమ కార్యకలాపాలను ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.

➡️