బిజెపికి నిధుల వరద

Mar 22,2024 10:50 #BJP, #Flood of funds
  • నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్లలోనూ 65 శాతం కైవసం
  • పదేళ్లలో ఏకంగా రూ.5000 కోట్ల నిధులు
  • దర్యాప్తు సంస్థల సోదాల ఫలితమే అంటున్న విశ్లేషకులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో ప్రజా వ్యతిరేక చర్యలతో, కార్పొరేట్‌ అనుకూల విధానాలతో వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తూ వస్తున్న బిజెపికి కార్పొరేట్‌ కంపెనీలు భారీగా నిధులు కుమ్మరించి కొమ్ముకాస్తున్నాయి. ఎన్నికల బాండ్లలో అత్యధిక నిధులు దక్కించుకున్న ఆ పార్టీ నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలోనూ మిగిలిన రాజకీయ పార్టీలు అన్నింటికంటే అత్యధిక నిధులను సొంతం చేసుకుంది. నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల మొత్తం నిధుల్లో దాదాపు 65 శాతం (రూ.5000 కోట్లు) నిధులను బిజెపి వంశమయ్యాయి. ఈ నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల విధానాన్ని కూడా 2003లో నాటి బిజెపి ప్రభుత్వమే తీసుకురావడం ప్రస్తావనర్హం. దీని ప్రకారం..రూ.20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే వాటిని బాండ్ల రూపంలో సమర్పించాల్సివుంటుంది. ఈ మొత్తానికి గాను సదరు కంపెనీలకు వంద శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది.
కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) వద్ద ఉన్న సమాచారం ప్రకారం..2013-23 మధ్య రాజకీయ పార్టీలకు నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.7,726 కోట్ల విరాళాలు అందుకున్నాయి. ఈ మొత్తంలో ఒక్క బిజెపికే రూ.5,000 కోట్లు (64.7 శాతం) నిధులు అందాయి. కాంగ్రెస్‌కు 10.7 శాతం, బిఆర్‌ఎస్‌కు 3.3 శాతం, ఆమ్‌ ఆద్మీ పార్టీ 3.1 శాతం విరాళాలు దక్కాయి. కాగా 2014లో రూ.309 కోట్ల నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల వితరణ చేయగా..2020లో వీటి రూపంలో అందజేసిన విరాళాలు రూ.1,247 కోట్లకు చేరాయి. అయితే 2018 కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వ బిజెపి ప్రభుత్వం ఎన్నికల బాండ్ల విధానానికి విస్తృత ప్రాచుర్యం కల్పించడంతో కంపెనీలన్నీ ఆ రూపంలో విరాళాలు సమర్పించేందుకు మొగ్గు చూపాయి. దీంతో నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు 2023లో స్వల్పంగా క్షీణించాయి. ఆ ఏడాది కూడా రూ.1,101 కోట్ల మేర నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలను కంపెనీలు సమర్పించుకున్నాయి. ఈ నాన్‌ ఎలక్టోరల్‌ బాండ్లు సమర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన కొన్ని కార్పొరేట్‌ కంపెనీల గ్రూపు వేదిక ‘ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ (పిఇటి)’ గతేడాది బిజెపికి ఏకంగా రూ.256 కోట్లు సమర్పించింది. బిజి షిర్కే కన్‌్‌స్ట్రక్షన్స్‌ టెక్నాలజీ సంస్థ కూడా బిజెపికి రూ.35 కోట్లు అందజేసింది. తెలంగాణలో నాడు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ (ఇదివరకు టిఆర్‌ఎస్‌)కు కూడా పిఇటి రూ.90 కోట్లు విరాళంగా అందజేసింది. కాగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంఎస్‌ ఎంకెజె ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.45 కోట్లు విరాళంగా అందజేసింది.

తీర్పు రిజర్వు చేసిన తర్వాత కూడా రూ.8,350 కోట్ల బాండ్ల ముద్రణ

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగబద్ధతపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2023 నవంబరులో తీర్పును రిజర్వ్‌ చేసింది. తీర్పు అనుకూలంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఒక్కోటి కోటి రూపాయల విలువైన 8,350 బాండ్లను ముద్రించింది. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద హక్కుల కార్యకర్త, మాజీ సైనికోద్యోగి కమాండర్‌ లోకేష్‌ బత్రా అడిగిన ప్రశ్నకు ఎస్‌బిఐ ఈ వివరాలు అందించింది. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న పార్టీల్లో బిజెపిదే అగ్రస్థానమన్న విషయం తెలిసిందే.
ఎన్నికల కమిషన్‌ ప్రచురించిన వివరాల ప్రకారం 2018 నుండి ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి ఖాతాకు రూ.8,251.8 కోట్లు చేరాయి. ఆ కాలంలో విక్రయించిన మొత్తం బాండ్ల విలువ రూ.16,518 కోట్లు. అంటే విక్రయించిన బాండ్లలో 50 శాతం బాండ్లను బిజెపి నగదుగా మార్చుకుంది. బాండ్ల ముద్రణ, నిర్వహణ ఖర్చు యావత్తూ పన్ను చెల్లింపుదారులే భరించారు. దాతలు కానీ, విరాళాలు అందుకున్న పార్టీలు కానీ పైసా కూడా వెచ్చించలేదు. 2018-23 మధ్యకాలంలో కమిషన్‌, ముద్రణ, ఇతర నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి ఎస్‌బిఐ రూ.13.50 కోట్లు వసూలు చేసింది. ఈ సంవత్సరం 8,350 బాండ్ల ముద్రణ, నిర్వహణ కోసం ఎంత ఖర్చు చేసిందీ తెలియరాలేదు. ఏదేమైనా ఈ మొత్తాన్ని భరించింది పన్ను చెల్లింపుదారులే. సుప్రీంకోర్టు యథాతథస్థితిని కొనసాగిస్తుందని ప్రభుత్వం భావించిందని, అందుకే కోటి రూపాయల విలువ కలిగిన బాండ్లను ముద్రించిందని హక్కుల కార్యకర్త బత్రా వ్యాఖ్యానించారు.

➡️