1,767 గ్రామాల్లో తొలి విడత స్ప్రేయింగ్‌-

Apr 16,2024 00:03
స్ప్రేయింగ్‌ పనులు ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు:మలేరియా ప్రభావిత గ్రామాలలో ముందస్తుగా దోమల మందు పిచికారీ చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత తెలిపారు. సోమవారం చింతలవీధి పంచాయతీ ఉబ్బేటిపుట్టు గ్రామంలో దోమల మందు పిచికారీ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన గ్రామాలలో ఎసిఎం మందు పిచికారీ పనులు పూర్తి చేయాలని మలేరియా అధికారులను సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి వైద్య, మలేరియా సిబ్బంది సమన్వయంతో పని చేసి విజయ వంతంగా పిచికారీ పనులు పూర్తి చేయాలని సూచించారు. మొదటి విడత స్ప్రేయింగ్‌ కార్యాచరణ ప్రకారం ఈనెల 30వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 62 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 307 సచివాలయాల పరిధిలోని 1767 గ్రామాలలో దోమల మందు (ఎసి యం 5 శాతం)ను పిచికారీ చేయడానికి లక్ష్యంగా నిర్దేశించామని చెప్పారు. పిచికారీ పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. దోమల మందు పిచికారీకి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టి. ఎస్‌. ఎస్‌. ప్రసాద్‌, డిఐ ఓ.సాధన, సబ్‌ యూనిట్‌ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️