ఫిన్లాండ్‌లో మూడు రోజుల సమ్మె ప్రారంభం

Feb 1,2024 08:48 #Finland, #strike
finland-is-hit-by-massive-strikes-protesting-plans-to-cut-social-security-and-change-how-pay-is-set

సామాజిక భద్రతా నిధుల్లో కోతలు, వేతన వివాదాలపై సమ్మె

హెల్సింకి : ఫిన్లాండ్‌లోని కార్మిక సంఘాలు బుధవారం సమ్మెకు దిగాయి. మూడు రోజుల పాటు సాగే ఈ సమ్మెలో దాదాపు మూడు లక్షలమంది కార్మికులు పాల్గొంటున్నారు. ఫిన్నిష్‌ కార్మిక సంఘాల కేంద్ర సమాఖ్య, ఫిన్నిష్‌ వృత్తినిపుణుల సమాఖ్యలు ఈ సమ్మెకు పిలుపిచ్చాయి. ప్రధాని పెట్టెరి ఓర్పో నేతృత్వంలోని మధ్యే మితవాద ప్రభుత్వం ప్రతిపాదించిన సామాజిక భద్రతా నిధుల్లో కోతలు, లేబర్‌ మార్కెట్‌కు చేస్తున్న ఉపాధి సవరణలతో సమాజంలో తీవ్ర అసమానతలు పెరుగుతాయని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల సమ్మె చేసేందుకు ఉద్యోగులకు గల హక్కులు నియంత్రించబడతాయి. వేతనాల పెంపులు చేయకుండా నేషనల్‌ లేబర్‌ మీడియేటర్‌ను నివారిస్తుంది. దీన్ని కార్మికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. వేతనాలను ఎలా నిర్ధారించాలన్న విషయంలో ఇప్పటివరకు నేషనల్‌ లేబర్‌ మీడియేటర్‌ పాత్ర వుండేది. తాజాగా ఓర్పో ప్రభుత్వం తీసుకునే చర్యలతో సమాజంలో అసమానతలు పెరుగుతాయని, కార్మికుల స్థితిగతులు బలహీనపడతాయని, దిగువ ఆదాయ గ్రూపులకు, నిరుద్యోగులకు ముప్పు వాటిల్లుతుందని ఆయా యూనియన్లు విమర్శిస్తున్నాయి. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా కిండర్‌గార్టెన్‌, ప్రీ స్కూళ్ళు మూతపడతాయి. వైమానిక రవాణా, పోస్టల్‌ సేవలకు అంతరాయం కలుగుతుంది. ప్రజా రవాణా మూత పడుతుంది. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, దుకాణాలు, హోటళ్ళు అన్నీ మూతపడతాయి. ఈ సమ్మె కారణంగా దాదాపు 550 విమానాలను రద్దు చేసినట్లు జాతీయ వైమానిక సంస్థ ఫిన్‌ ఎయిర్‌ ప్రకటించింది. ప్రధానంగా హెల్సింకి విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను బాగా తగ్గించినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన కోతలను, మార్పులను తక్షణమే విరమించాలని సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఫిన్నిష్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఎస్‌ఎకె), ఫిన్నిష్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్స్‌ (ఎస్‌టిటికె)లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

➡️