ఐదో గది

Apr 7,2024 07:40 #Sneha, #Stories

అతని కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి. అది దరిదాపుల్లో కనిపించడం లేదు. ‘కొంపదీసి అది నా ఉనికిని పసిగట్ట లేదు కదా?!?’ అని మనసులో అనుకున్నాడు.
‘అబ్బే అలా జరగడానికి అవకాశమే లేదే! నా ఊపిరిని కూడా బిగబట్టి ఉంటినే. ఖచ్చితంగా అదిటే వస్తది. ఏదో టైమున వచ్చి తీరుతుంది. ఈ నిశ్శబ్ద నిశిలో పొద్దు గడవక.. ఝాము గడిచినా జాడలేదని, అనుకుంటిని గానీ,’ అని అనుకొని మరిడయ్య చడీ చప్పుడు కాకుండా కళ్ళు గట్టిగామూసుకుని, దాని రాకకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అతని మనస్సు గతంలోకి తొంగి చూసింది.
000
మరిడయ్య పేరు చెబితే ఆ గూడెంలో తెలవనివాళ్ళు ఉండరు. పెద్దల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన పసరు వైద్యాన్ని ఔపోసన పట్టి, గిరిపుత్రులకు ధన్వంతరి అయ్యాడు. ఎవరి దగ్గరా పైసా తీసుకోడు. ఎవరన్నా సంతోషంగా ‘కష్టపడ్డావు కదా! ఈ డబ్బులు ఉంచుకో’ అని అన్నా ‘నా నేటి సేసినాను.. అడవి తల్లి ఇచ్చిన ఆకులూ, మూలికలే గందా మీ కిస్తిని. నాకు తెలిసిన విద్దె, అందరికీ ఉపయోగపడుతోందంటే ఇంతకన్నా ఆనందం ఏటి కావాలా!?! ఆ ఇనుప రూకలు ఈ రోజు కడుపు నింపితే.. తెల్లారి మలంలో పోతవి. పదిగురికి నే సేసే ఈ సేవ వల్ల.. వాళ్ళు నయమై, సంతోషంగా ఇంటికి వెళుతుంటే.. వచ్చే ఆనందం ఈ కట్టె కాలే వరకూ ఉంటది’ అని అనేవాడు. ఒంటరిగా ఉండే మరిడయ్యకు భూలోకంతో పెళ్ళి కుదిరింది. ఆమె కూడా భర్త అడుగు జాడల్లో నడిచేది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భూలోకం నీళ్ళోసుకుంది. భార్య అంటే మరిడయ్యకు పంచ ప్రాణాలు కావడంతో.. కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకున్నాడు.
ఆమెకు నెలలు నిండాయి. నొప్పులు మొదలయ్యాయి. సమయానికి మంత్రసాని ఊర్లో లేదు. ఏం చేయాలో పాలుపోలేదు మరిడయ్యకు. పట్నం తీసుకుని వెళదామంటే! ఆ టైంలో బస్సు సౌకర్యం ఆ గూడానికి లేదు.
‘ఓరి మరిడి దిగులు పడబోక. మంచిగానే బిడ్డని కంటదిలే.. నీకు వైద్యం తెలుసుగా నువ్వే చెయ్యి.’ అంది ఓ అవ్వ.
‘నాకు సేయను సేతులు రావటం లేదు వణుకుతుండాయి. ఎందుకో గుండెలు దడ దడ కొట్టేసుకుంటున్నాయే అవ్వా. ఎట్నో అట్ల పట్నం డాక్టర్‌ దగ్గరికి తోలుకుపోతే.. మంచిగా చూసుకుంటాడు.’ అన్నాడు మరిడయ్య.
గ్రామంలో ఉన్న నలుగురు యువకులు నులకమంచం తెప్పించి, కంబళీలు పరిచి దానిమీద భూలోకాన్ని పడుకోబెట్టి, భుజానికి ఎత్తుకొని పట్నానికి తీసుకెళ్లారు. గ్రామంలో ఉన్న కొందరు పెద్దలు, యువకులు కూడా కాలినడకన వారితో పట్నానికి బయలుదేరారు. మంచి పేరుప్రతిష్టలు ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మొగుడు పెళ్ళాలు ఇద్దరూ డాక్టర్లే. ముందు నుంచి మా దగ్గర ట్రీట్మెంట్‌ తీసుకోలేదు కాబట్టి చూడను పొమ్మంది.
బతిమలాడిన మీదట.. కన్సల్టింగ్‌ ఫీజు కడితేనే కానీ పేషెంట్‌ కండిషన్‌ చూడను.. పేషెంట్‌ కండిషన్‌ బాగుంటేనేగానీ ఎడ్మిట్‌ చేసుకోను అంది ఆ డాక్టర్‌. కన్సల్టింగ్‌ ఫీజు కట్టారు. స్కానింగ్లు, ఆ టెస్ట్‌ ఈ టెస్ట్‌ అని అవసరం ఉన్నా లేకపోయినా అన్ని టెస్టులూ రాసేసి మొత్తం డబ్బులన్నీ గుంజేసారు. తర్వాత మరిడయ్య చేత సంతకాలు పెట్టించుకుని ఎడ్మిట్‌ చేసుకున్నారు.
ఓ కొండవీటి చాంతాడంత మందుల లిస్ట్‌ రాసి తెమ్మన్నారు. ‘ఇన్నోటి మందులే ఇప్పుడే మింగించేత్తారా?’ అనుమానంగా అడిగాడు మరిడయ్య.
‘మేం మింగటానికిలే… వెళ్ళు వెళ్ళవయ్యా… అసలు ఈ టైంలో తీసుకొస్తే జాయిన్‌ చేసుకోరు మా మేడం. మొదటి నెల నుంచే ఇక్కడ ట్రీట్మెంట్‌ తీసుకోవాలి. అయినా మీ మీద జాలితో మా మేడం జాయిన్‌ చేసుకున్నారు. మందులు తెమ్మంటే ఎదురు ప్రశ్నిస్తావే? పోయి అర్జెంటుగా ఈ మందులన్నీ పట్టుకురా’ అంది నర్సు.
మెడికల్‌ షాప్‌ వాడు ఆ మందులు చూసి పదివేలు అవుతాయని చెప్పాడు.
‘అమ్మో అంతే!’ అని ఆశ్చర్యపోయి ‘నా దగ్గర అంత లేవు, డబ్బులు మళ్ళీ ఇస్తాను మందులు ఇవ్వండి,’ అని బతిమాలాడు మరిడయ్య.
‘అలా వీలు కాదు, డబ్బులన్నీ కడితేనే మందులిస్తా,’ అన్నాడు అతను. అందరి దగ్గరవి పోగేసుకున్నా అంత డబ్బు సమకూర లేదు. రేపటికల్లా తెచ్చిస్తాను. ట్రీట్మెంట్‌ మొదలు పెట్టండని, డాక్టర్‌ గారి కాళ్లావేళ్ళా పడ్డాడు. వాళ్ళు ససేమిరా అన్నారు. చేసేదిలేక ఆ రాత్రికి రాత్రి గూడెం పోయి, తన కుంట పొలాన్నీ తనఖా పెట్టాడు. గ్రామస్తులు అతని మీద ఉండే అభిమానంతో వారు నిల్వ చేసుకున్న డబ్బులను తెచ్చిచ్చారు. మొహమాటానికి తీసుకోకపోతే.. ప్రయివేటు దవాఖానాలో ఖర్చులు ఎక్కువవుతాయి. ఇవి అప్పుగానే తీసుకో, తర్వాత తీరుద్దువు అంటూ, బలవంతంగా ఇచ్చి పంపారు.
అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా భూలోకం బతకలేదు. బిడ్డా దక్కలేదు. ఒంటరి అయిపోయిన మరిడయ్యలో నిరాశ చోటుచేసుకొంది. తనకున్న ఇల్లు, పొలమూ అన్నీ అమ్మేసి, అందరి బాకీలు తీర్చేసాడు. ఒంటరిగా బతకలేను అనుకున్న మరిడయ్య, తనువు చాలించాలని నిశ్చయించుకున్నాడు.
‘పరోపకారార్థం మిదం శరీరం’ అని నమ్మే అతను చివరికి తన తనువు పులికి ఆహారంగా మారాలని తలచి, పులి తిరిగే స్థలంలో, దానికొరకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని గతాన్ని నెమరు వేసుకుంటున్న మరిడయ్యకు చేరువలో చెవులకు ఆర్తనాదాలు వినబడ్డాయి.
000
వెంటనే మరిడయ్య ఆ అరుపులు వినిపించిన దిశగా వెళ్ళాడు. యాక్సిడెంట్‌ అయినట్లుంది. కారు లోయలో పడి ఉంది. గబగబా అక్కడికి చేరుకున్నాడు. అంతా వెతికాడు ఓ ఇద్దరు మూలుగుతూ తుప్పల్లో చిక్కుకుని కనబడ్డారు.
వారిని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చాడు. ఇద్దరూ భార్యాభర్తలులా ఉన్నారు. వెన్నెల వెలుగులో వారిని గుర్తించాడు. తన భార్యకు ట్రీట్మెంట్‌ ఇచ్చి, భూలోకాన్ని స్వర్గలోకం పంపిన డాక్టర్లు వాళ్ళు. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు. మనస్సు ఒక్క క్షణం అదుపు తప్పి.. వాళ్ళను వదిలేద్దాం. ఆ భగవంతుడే వాళ్ళకు తగిన శిక్ష వేసాడు అని అనుకున్నాడు.
వెంటనే అతనిలోని వివేకం వెన్ను తట్టింది. ‘వాళ్ళు గడ్డి తిన్నారని మనం కూడా తింటే.. మనకూ వాళ్ళకూ తేడా ఏమిటి? తమను కాలితో తొక్కుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, కత్తి పుచ్చుకుని నరుకుతున్నారు అని చెట్లు మనకి నీడను ఇవ్వడం మానేస్తున్నాయా? పండ్లు ఇవ్వటం మానుతున్నాయా ? కలప ఇవ్వటం మానుతున్నాయా? చలనము లేని నోరులేని ఆ మొక్కలే నిస్వార్థ సేవ చేస్తూంటే! మనిషినైనా నేను కక్షలూ కార్పణ్యాలు పెట్టుకుంటే నా సహజగుణం ఏం కాను? పగ అనే రెండు అక్షరాలు నాలోకి ప్రవేశిస్తే, అవి చాప కింద నీరులా చల్లగా నా మంచిని ముంచేస్తాయి!’ అని అనుకుని, వాళ్లని రక్షించడానికి తీర్మానించుకున్నాడు.
కానీ ఎలా? తాను ఒక్కడే.. వాళ్ళు ఇద్దరు ఉన్నారు.. వారిని ఎలా రక్షించడం? ఎవరి సహాయం అన్నా తీసుకుందామంటే గూడానికి వెళ్ళాలి. ఇది పులులు తిరిగే ప్రదేశం. ఇక్కడ వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్లకూడదు. దగ్గరగా ఉంటుందని ఇటువైపు నుంచి రోడ్డు మార్గం వేసారే గానీ, క్రూర మృగాలు తిరిగే ప్రదేశం అని ప్రభుత్వం వారు కూడా తొమ్మిదిలోపే ఈ మార్గం గుండా వాహనాలు వెళ్ళాలని నిర్దేశించి ఉన్నారు.
ఆ తర్వాత ఏవీ రావు. మరి వీళ్ళు ఎలా వచ్చారో గానీ!?! అయినా వాళ్ళు ఎలా వస్తే నాకెందుకు? ముందు వీళ్ళను ఎలా రక్షించాలో ఆలోచించాలి అని అనుకున్నాడు.
ముందు వాళ్ళకి స్పృహ తెప్పించాలి, అనుకొన్న అతనికి.. ‘దయగల హృదయానికి తోడుంటుంది’ అన్నట్లుగా దొర్లి పడిందో ఏమో కొద్ది దూరంలో వాటర్‌ బాటిల్‌ కనబడింది. ఆ బాటిల్‌ తెచ్చి, నీళ్లు వాళ్ళ మొహం మీద చిలకరించాడు. స్పృహలోకి రాగానే వారికి కాస్త మంచినీళ్ళు తాగించాడు. ఇరువురికి దెబ్బలు బాగా తగిలినట్లు ఉన్నాయి. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ, వాళ్ళు కదిలే స్థితిలో లేరు అని గ్రహించాడు. మెల్లిగా వాళ్లని రోడ్డు పక్కకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. రక్తం ఇంకా కారుతూనే ఉంది. ముందు దాన్ని అరికట్టాలి. అని అనుకుని, అతనికి తెలిసిన ఆకు కోసం చుట్టూచూశాడు. అతనికి బాగా పరిచయమైన ఆకే అది. చీకట్లో అయినా దాన్ని గుర్తించగలడు. అదీ దగ్గరలోనే దొరికింది. వెంటనే దాని ఆకులు కోసుకొచ్చి, పసరు తీసి వారి గాయాలకు పూసి, తన లుంగీని చింపి – కట్లు కట్టాడు.
ఎండు పుల్లలు అన్నింటినీ పోగేసుకు వచ్చి తన జేబులో ఉన్న అగ్గిపెట్టెతో మంట చేసాడు. ఆ వెలుగుకి క్రూర మృగాలు ఈ పక్కకి రావన్న ఉద్దేశంతో. ఆ పక్కనే ఉన్న చిన్న తాటిచెట్టు ఆకును అతికష్టం మీద రాళ్ల సహాయంతో కట్‌ చేసి, వారికి విసరడం మొదలుపెట్టాడు. తెల్లవార్లూ తాను కూడా నిద్రపోకుండా వాళ్లకు విసురుతూ.. వాళ్ళకు కాపలా కూర్చున్నాడు.
తెల్లారి గూడెంవాళ్ళు ఆ పక్కకు రాగానే వారి సహాయంతో తన ఇంటికి వారిని చేర్చాడు. వాళ్లను గుర్తించిన గ్రామస్తులు.. ‘మనకి ఈ సేవలు వద్దనే వద్దు. ముందు గెంటేయి.’ అన్నారు. ‘అయినా నువ్వు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్లావు?’ అంటూ నిలదీశారు. ‘శబ్దం అయితే వెళ్లాను’ అని బొంకినా.. మరిడయ్య ఆత్మార్పణ చేసుకోవడానికే వెళ్లాడని గ్రహించినవాళ్లు.. దీనికంతటికీ కారణం ఈ డాక్టర్లే అంటూ.. వాళ్లను తిట్టడం మొదలుపెట్టారు.
‘అలా తిట్టబోకండి. వాళ్లే కదా నన్ను బతికించారు. వాళ్లకి యాక్సిడెంట్‌ అవ్వబట్టే కదా! నేను బయటకు వచ్చా. లేకపోతే ఈపాటికి నన్ను పులులు తినేసేవి గందా!’ అన్నాడు.
ఇంకా అతనికి చెప్పి లాభం లేదు అని వదిలేసారు. ‘మీ వాళ్ళకు కబురంపాలా?’ ఆ డాక్టర్లను ఉద్దేశించి, అడిగాడు మరిడయ్య.
‘మాకు పిల్లలు లేరు. మాకు మేమే ఒకళ్ళకి ఒకళ్ళం తోడు.’ అన్నాడు ఆ డాక్టర్‌. ఆ డాక్టర్లు కొంచెం కోలుకున్నాక వెళ్ళిపోతాము. నీవు చేసిన సేవలు మర్చిపోలేము. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు!’ అంది లేడీ డాక్టర్‌.
‘నాకు పైసలతో పని లే,’ అన్నాడు మరిడయ్య. ‘బతకడానికి డబ్బు కావాలి కదా! మాకు వైద్యం చేసి మమ్మల్ని కాపాడావు. దానికి ప్రతిఫలం తీసుకోవాలి కదా!’ అంది.
‘మనకి ఊపిరి పోయడానికి కమ్మగా గాలిచ్చే సెట్లకు మనమేమిత్తున్నాము? కొండలపై నుంచి దొర్లుకుంటూ.. రాళ్ళ దెబ్బలు తింటూ.. అడ్డాలు ఎన్ని పడినా.. పక్కకి తప్పుకుని పారొచ్చి, మన దప్పిక తీర్చే ఆ ఏటికి ఏమిస్తున్నాము? అంతెందుకు తెల్లారి లేచింది మొదలు మనం ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉంటాం. అయినా మన బరువును మోస్తుంది. మనకు ఆహారాన్ని అందిస్తుంది. మరి ఆ భూమాతకు ఏమిస్తున్నాం? మనకు రాత్రీ పగలూ తేడాలు చెబుతూ కాలాన్ని తెలుపుతూ! మబ్బులను తనలో దాచుకొని వాన జల్లులు కురిపిస్తుందే! ఆ ఆకాశానికి మనమేమిస్తున్నాం? తన వేడిమి ద్వారా జీవులలో కదలికలు తీసుకొస్తున్నాడే ఆ సూర్యుడు మరి ఆ పగటి దేమునికి ఏమిస్తున్నాము? వాటికి వేటికీ ఇవ్వని డబ్బును నాకిస్తానంటారే?’ అమాయకంగా అడిగాడు మరిడయ్య.
‘అది ప్రకృతి స్వభావం. వాటి సేవలు ఉచితం’ అంది ఆమె. ‘మరి మనిషి స్వభావం కూడా సాయం చేయటమే కదా! మరి మనిషి సేవలకు ఖరీదు ఎందుకు అడుగుతున్నారు?’ అన్నాడు.
ఆమె గుండెను పిండేసాయి ఆ మాటలు. ఆమె డబ్బుకి కక్కుర్తిపడి, మందుల మీద వచ్చే పర్సంటేజ్‌, స్కానింగ్‌లపై వచ్చే పర్సంటేజ్‌.. ఇలా డబ్బుకి ఆశపడి ఈ సమయంలోనే ఎంత గుంజుకున్నా నార్మల్‌గా డెలివరీ అవ్వవలసిన ఇతని భార్యని, కాల యాపన చేసి కండిషన్‌ క్రిటికల్‌ చేసి, కాష్టానికి పంపించింది. కానీ ఇతను తన భార్య ప్రాణాలను హరించినా.. తమ ప్రాణాలను కాపాడాడు. దేనికీ ఆశ పడటం లేదు.’ అనుకుంది.
అడ్డదారిలో ఇంటికి తొందరగా చేరుకోవచ్చన్న ఆలోచనతో.. చెక్‌ పోస్ట్‌ దగ్గర లంచమిచ్చి, ఈ మార్గం గుండా బయలు దేరిన వారికి రోడ్డుమీద పులి కనిపించేసరికి, భయంతో స్టీరింగ్‌ అదుపుతప్పి, యాక్సిడెంట్‌ అయింది. కళ్ళు తెరిచేసరికి ఇతను వీరికి సేవలు చేస్తూ కనిపించాడు. మా కళ్ళు తెరిపించడానికి ఆ భగవంతుడే మమ్మల్ని ఇతని దగ్గరికి చేర్చాడా!’ అనే ఆలోచన వచ్చింది.
పశ్చాత్తాపంతో ఆమే క్షమించమని అడుగుతూ అతని కాళ్ల మీద పడబోయింది.
‘అవేవో ఆ దేవుడికి సెప్పుకోండి నాకు కాదు. మీరు సేయాల్సింది ఏదో మిగిలి ఉండట్టుండాది. అందుకే బతికిపోనారు.’ అన్నాడు. ‘ఇంకా మేము నీ మీద పడి తినడం బాగుండదు వెళ్తాం,’ అంది. ‘మీరుంటే నా కేటీ కట్టం లేదు. నాకు నట్టమూ లేదు. ఇంకా కొన్ని దినాలుంటే పూర్తిగా నయమయి పోద్ది. ఆ యేల వరకూ ఉండండి,’ అన్నాడు మరిడయ్య.
ఇతను చేసే ప్రకృతి వైద్యం వల్ల చాలా త్వరగా మెరుగయ్యింది. శరీరం కూడా చాలా తేలికగా ఉంది. అందుకే వాళ్ళు తగ్గేవరకూ అక్కడే ఉండిపోదామని అనుకున్నారు. వాళ్లకి పూర్తిగా నయమయ్యే వరకు వైద్యసేవలు అందించాడు మరిడయ్య.
వాళ్లు నయమై వెళ్ళిపోయాక, వాళ్ళు తమ గుండె గదులలో కనపడకుండా దాగిన ఐదో గది తలుపులు తీశారు. ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందించడం మొదలు పెట్టారు. ఎవరన్నా సంతోషంతో ఏమన్నా ఇస్తే.. కాదనకుండా తీసుకునేవారు. ఇన్నాళ్లూ దాచిపెట్టిన సంపాదనను నిజమైన బీదవాడి మందులకి ఆపరేషన్లకి ఖర్చు పెట్టేవారు. మానవత్వంతో ఆ ఐదోగదిని నింపేసారు వారు.

  • ఘాలి లలిత ప్రవల్లిక, 96032 74351
➡️