హైదరాబాద్‌లో ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు

హైదరాబాద్‌ : ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్‌ పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది జూన్‌ 6నుంచి జరిగే టోర్నమెంట్‌ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో జరనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(టిఎఫ్‌ఏ) మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఈ అపూర్వ అవకాశాన్ని టిఎఫ్‌ఏకి అప్పగించినందుకు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఎఐఎఫ్‌ఎఫ్‌) ప్రెసిడెంట్‌ కళ్యాన్‌ చౌబేకి కృతజ్ఞతలు తెలిపారు. టిఎఫ్‌ఏ ఛైర్మన్‌ డా.కెటి మహి, కార్యదర్శి జిపి ఫాల్గుణ, మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఈ విషయమై వీరు చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర క్రీడా సంఘాలన్నింటికీ ఆర్థిక సహాయం అందించేందుకు నిధులు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు తెలంగాణ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారని, ఈ టోర్నమెంట్‌ తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలుస్తుందని డాక్టర్‌ మహి తెలిపారు.

➡️