నెర్రెలు బారిన పొలాలు

  • కీలక దశలో ఆయకట్టు శివారు భూములకు అందని సాగునీరు
  • వరి పంటను రక్షించుకోవడానికి
  • తీవ్ర అవస్థలు
  •  ఆయిల్‌ ఇంజన్లు, బోర్లు, కారెం ద్వారా తడులు
  • అయినా, పంట చేతికొస్తుందో? రాదోననే ఆందోళనలో రైతులు

ప్రజాశక్తి- భీమవరం : గోదావరి ఆయకట్టు శివారు భూముల్లో సాగులో ఉన్న వరికి నీరు సక్రమంగా అందడం లేదు. పంట పొలాలు నెర్రెలు బారుతున్నారు. పంటను రక్షించుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అదనపు పెట్టుబడి అవుతోంది. అయినా, పంట చేతికొస్తుందో? రాదో? అన్న ఆందోళన నెలకొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రబీలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 11 ప్రధాన పంట కాలులు, ఇతర పంట కాలువలు ఉన్నాయి. కాలువల ఆధునీకరణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం, ప్రధాన, ఉప కాలువల్లో తూడు, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో శివారు ఆయకట్టు భూములకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. వీరవాసరం మండలం మచ్చపూరి, పాలకోడేరు మండలం మొగోళ్లు, గుత్తులవారిపాలెం, ఆచంట వేమవరం, కొడమంచిలి, ఎలమంచిలి, నరసాపురం, శేరేపాలెం, కొప్పర్రు, ఆకివీడు, ఉండి, కాళ్ల, భీమవరం తదితర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వరి చేలు చిరు పొట్ట దశ నుంచి ఈనిక దశలో ఉన్నాయి. ఈ దశలో సాగు నీరు ఎక్కువగా అవసరం. ఈ ఏడాది జనవరి నుంచి గోదావరిలో నీటిమట్టం ఆశాజనకంగా లేదు. దీనికి తోడు గతేడాది వచ్చిన మిచౌంగు తుపాను కారణంగా రబీ సాగు ఆలస్యమైంది. దీంతో, ఏప్రిల్‌ నెలాఖరు వరకు సాగునీరు అందుతుందో? లేదో? తెలియని పరిస్థితి ఉంది. గత నెల ఐదో తేదీ నుంచి జిల్లాలో వంతుల వారి విధానం అమలవుతోంది. ప్రతి కాలువకు ఆరు రోజుల చొప్పున నీటిని అందిస్తున్నారు. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించామని అధికారులు చెప్తున్నారు. అధికారుల లెక్కలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. ఇప్పటికే శివారు ఆయకట్టు భూములకు నీరందడం లేదు. దీంతో, ఉమ్మడి జిల్లాలో సుమారు 60 వేల ఎకరాలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వరి పంట పొలాలు నెర్రెలు బారాయి. ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉన్న చోట ఆయిల్‌ ఇంజన్లు, బోర్లు, కారెం ద్వారా పొలాలకు సాగు నీరు అందిస్తున్నారు. ఇందుకోసం అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు.

ఆధునీకరణ పనులకు లభించని ఆమోదం
ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్‌డివిజన్ల పరిధిలో 57 అత్యవసర పనులకు రూ.3.97 కోట్లతో గత డిసెంబరులో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కర్ర నాచు, తూడు తొలగింపు, ఎత్తిపోతల పథకాల పనులు వీటిలో ఉన్నాయి. వీటికి నేటికీ ఆమోదం లభించలేదు.

పట్టించుకునే వారేరీ : కె.సత్యనారాయణ, కౌలు రైతు
సాగునీటి ఎద్దడి తలెత్తి పంట పొలాలు నెర్రెలు బారుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాను. పంటను రక్షించుకోవడానికి ఆయిల్‌ ఇంజన్‌ ద్వారా తడులు ఇస్తున్నాను. దీనివల్ల ఎకరా ఒక్కంటికీ రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనపు పెట్టుబడి అవుతోంది. కాలువలను ఆధునీకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

పూర్తి స్థాయిలో సాగు నీరందించాలి : మామిడిశెట్టి రామాంజనేయులు, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
సాగు నీటి కాలువల నీటి ప్రవాహం లెవలింగ్‌ పెంచాలి. ఆక్వా చెరువులకు నీరు తరలిపోకుండా చర్యలు చేపట్టాలి. నిరంతరం లస్కర్లను కాలువలపై పర్యవేక్షణకు ఉంచాలి. ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి.

➡️