దిగ జారిన ధరలతో రైతు దిగాలు

– దిగుబడులు తగ్గిన లేత శనగ
– ఎక్కువగా యంత్రాలతోనే నూర్పిడి
– యంత్రాలతో లేతశనగ నూర్పిడిలో మట్టిదెబ్బ
– కూలీలతోనే పీకుడు, నూర్పిళ్లు చేస్తున్న రైతులు
ప్రజాశక్తి – ఇంకొల్లు
రబీ విత్తన సమయంలో శనగల ధర ఆశాజనకంగా ఉంది. రైతుల్లో ఆశలు రేపింది. ధర బాగుందని ఆశపడ్డ రైతులు సాగుచేశారు. అయితే పంట నూర్పిల్లు అయ్యే సమయానికి ధరలు దిగజారాయి. ప్రత్యేక రకాలైన తెల్ల శనగల ధర ప్రస్తుతం మరింత దిగజారింది. విత్తన సమయంలో క్వింటాలు తెల్ల శనగలు రూ.13వేలకు వ్యాపారులు అమ్మగా ప్రస్తుతం నూర్పిడిలు ముగింసి రైతులు అమ్మాలనుకుంటున్న సమయంలో క్వింటాలు తెల్లశనగల ధర రూ.7500నుంచి రూ.8వేలలోపే ఉంది. వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం వస్తున్నారు. అదీ వ్యాపారం మందకోడిగా సాగుతుంది. జేజే 11 ఎర్ర శనగలు ఈ ఏడాది విత్తే సమయానికి ముందు రూ.6వేల నుంచి రూ.6500 పలకగా ప్రస్తుతం వాటి ధర రూ.5800లోపే పలుకుతుంది.
ముదురు శనగల్లో రకరకాల దిగుబడులు
ఈ ఏడాది తుఫానుకు ముందు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవవు అన్న అనుమానంతో అప్పటి వాతావరణ పరిస్థితిని బట్టి రైతులు రబీ పంట ఆలస్యం అవుతుందని శనగ విత్తనాలు చాలీచాలని పదనులోనే కొంతమంది రైతులు విత్తనాలు పెట్టారు. అనంతరం మారిన వాతావరణ పరిస్థితుల రీత్య అధిక వర్షాలు, తుఫాను సైతం కొట్టింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో శనగతో పాటు పలు రకాల పంటలు పూర్తిగా ఉరకెత్తి దెబ్బతిన్నాయి. దెబ్బ తినకుండా ఉన్న శనగ పొలాలకు కలుపు బెడద తగిలింది. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు కలుపు కూలి ఖర్చు అయ్యింది. కొంత మంది కలుపు తీయకుండానే సెనగ పంట వదిలేశారు. ఈ కారణంతో పలు రకాల దిగుబడులు వచ్చాయి. మొక్కజొన్న మిరప గతంలో వేసిన పంట మార్పిడి చేసిన పొలాల్లో కలుపు తీసిన పొలాల్లో ఎకరాకు 8 నుంచి 10 కింటాల దిగుబడి వరకు రాగా, కలుపు తీయని ఏటా శనగ పంట సాగు చేసే పొలాల్లో పంట మార్పిడి చేయని పొలాల్లో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు 4నుంచి 6క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది.
యంత్రాలతో శనగ పంట కోతలు
శనగసాగుచేసిన రైతులు ముదురు శనగను ఎక్కువ మంది హార్వెస్టర్ యంత్రాలతోనే నూర్పిడీ చేయిస్తున్నారు. వీటితో ఒకేసారి శనగలు బయటకు వస్తాయి. అదే కూలీలతో అయితే అంత పీకిన తర్వాత నూర్పిడి చేయాలి. ఈపని కూలీలతో అయితే ఎకరాకు రూ.7వేలు ఖర్చు అవుతుంది. అదే హార్డ్వేర్టర్‌తో అయితే ఎకరాకు రూ.3500లకే పంట చేతికొస్తుంది. మట్టి తొలగించే ఖర్చు అదనంగా ఏమీ ఉండదు. అందుకే ఎక్కువ మంది రైతులు హార్డ్వేర్టర్‌తోనే ముదురు కోతలు చేస్తున్నారు.
లేత శనగల్లో తగ్గుతున్న దిగబడులు
కొంత మంది రైతులు వర్షం పోయిన తర్వాత డిసెంబర్ ఆఖరులో లేత శనగ రభీలో విత్తనాలు ఎద పెట్టారు. ఈ లేత శనగ ముందు దెబ్బతిన్న వివిధ రకాల పంటలైన పొగాకు, మిరప, శెనగ వంటివి సాగు చేసిన పొలాల్లో సైతం మళ్లీ ఎద పెట్టారు. అయితే ఈ సెనగకు వాతావరణం అనుకులించలేదు. పదును చాలక పోవడంతో దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఎకరాకు రెండు క్వింటాల నుంచి చేలో ఉన్న పదును బట్టి 6క్వింటాళ్లలోపే దిగుబడి వస్తుంది. అయితే ఈ లేత సెనగ హార్డ్వేస్టర్‌తో కోతకొస్తే ఎక్కువగా మట్టి వస్తుంది. దీంతో కూలీలతో పీకించటం తప్పనిసరైంది. ఎకరాకు ఎర్రశెనగకు రూ.3వేలు, తెల్ల సెనగకు రూ.3500 నుంచి రూ.4వేలు కూలి చెల్లించవలసి వచ్చింది. దీనికి తోడు నూర్పుడి ఖర్చు మరో రూ.3500 అవుతుంది. తగ్గిన దిగుబడులకు తోడు కోతకూలి, నూర్పుడి ఖర్చు ఎకరాకు రూ.7వేలు అవుతుంది. దీంతో లేత శనగ సాగు చేసిన రైతు ఈ ఏడాది పూర్తిగా నష్టలపాలు కానున్నాడు. కొనుగోలు మందకోడిగా ఉండటానికితోడు ధరలు లేకపోవడంతో ధర పెరిగే వరకు కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కూలి, పెట్టుబడులకు అవసరమైన సన్నా, చిన్న కారు రైతులు, కౌలు రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

➡️