13వ రోజు కొనసాగిన రైతుల ఆందోళన

Feb 26,2024 11:07 #formers protest

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతుల పండించిన అన్ని పంటలకూ సి2ప్లస్‌50 శాతంతో కూడిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం చేయాలని, రైతు రుణమాఫీ చేయాలని, రైతులకు బీమా, పెన్షన్‌ సదుపాయం కల్పించాలని, విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 13వ రోజుకు చేరింది. ఆదివారం హర్యానా-పంజాబ్‌ సరిహద్దులు శంభు, ఖానౌరీ ప్రాంతాల్లో చేస్తున్న ఆందోళనల్లో భారీ సంఖ్యలో రైతులు, వివిధ తరగతుల ప్రజలు చేరారు. అందులోనూ మహిళలు ఎక్కువ మంది ఆందోళనలో భాగమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిన ఐదో రౌండ్‌ చర్చలకు తేదీ ఖరారు కాలేదు. దీంతో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో యువ రైతు మరణం నేపథ్యంలో 29 వరకు సరిహద్దుల్లోనే రైతులు తమ ఆందోళన కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు కాల్పులు జరిపిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆ యువ రైతుకు పోస్టుమార్టానికి రైతు సంఘాలు, కుటుంబ సభ్యులు అనుమతించలేదు. అలాగే హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌, బల్క్‌ మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ను పునరుద్ధరించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులు సింఘూ, టిక్రీల వద్ద పోలీసులు బారికేడ్లు పాక్షికంగా తొలగించారు. రాకపోకలకు అనుమతించారు.

➡️