పిల్లల పుట్టుకతోనే కుటుంబాలు మొదలౌతాయి..

Apr 5,2024 06:30 #feachers, #Jeevana Stories

‘పిల్లల పుట్టుకతోనే కుటుంబాలు మొదలౌతాయ’ని ఆ వైద్యుడు నమ్ముతారు. ఆ పిల్లలే అంగవైకల్యంతో పుడితే ఆ కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడతాయో కళ్లారా చూశారు. గర్భస్థ శిశువు అవయవాల ఎదుగుదల సరిగ్గాలేదని గుర్తించినా చట్టం ప్రకారం గర్భస్రావం చేసే అవకాశం లేని నిస్సహాయస్థితికి ఎన్నోసార్లు నిందించుకున్నారు. ఫలితంగా అవయవ లోపంతో జన్మించిన ఆ బిడ్డలు, ఆ తల్లిదండ్రుల కన్నీటి గాథలకు సజీవ సాక్ష్యంగా నిలిచారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో సంఘటనలు ఆయనను కదిలించివేశాయి. 1971 నాటి చట్టం ప్రకారం నిర్దేశించిన గర్భస్రావ గడువు సవరణకై 14 ఏళ్లపాటు అవిశ్రాంత పోరాటం చేసిన ముంబయికి చెందిన ప్రసూతి వైద్యులు డాక్టర్‌ నిఖిల్‌ దత్తార్‌ విజయగాథ ఇది.
పంతొమ్మిదేళ్ల క్రితం నిఖిల్‌ దగ్గరకు ఓ గర్భిణీ వచ్చారు. పరీక్షల్లో ఆమె గర్భస్థ పిండం ఎదుగుదల సరిగ్గా లేదు. ఆమె ఆ బిడ్డను వద్దనుకుంది. కానీ చట్టం ప్రకారం అది నేరమని, నిఖిల్‌ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆమె తన కోరికకు విరుద్ధంగా అవయవ లోపంతో ఉన్న బిడ్డకు జన్మ ఇవ్వాల్సి వచ్చింది.
‘ఆ బిడ్డ శరీరంలో నడుం కింది భాగమంతా చచ్చుబడిపోయింది. పేగు, మూత్రాశయం నియంత్రణ లేకుండా పుట్టిన ఆ బిడ్డను పెంచేందుకు ఆ తల్లి, ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. స్కూలు వయస్సు వచ్చినా ఎవ్వరూ అడ్మిషన్‌ ఇవ్వలేదని తల్లడిల్లిపోయారు. 9 ఏళ్ల పాటు వారు ఆ బిడ్డతో పడరాని పాట్లు పడ్డారు. చివరికి కళ్లముందే కన్నబిడ్డ ఆయుష్సు తీరిపోయింది. ఆ విషాద సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది’ అని నిఖిల్‌ గతాన్ని గుర్తు చేసుకున్నారు.

చట్టంలో లేదు..
నిఖిల్‌ ఆమెకు గర్భస్రావం చేసేందుకు ఎందుకు నిరాకరించారంటే, 1971నాటి మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్టప్రకారం 20 వారాలు దాటిన గర్భాలకు గర్భస్రావం నిషేధించబడింది. ‘నా దగ్గరకు వచ్చే నాటికి
ఆమె 24 వారాల గర్భవతి. చట్ట ప్రకారం ఆ గర్భాన్ని తొలగించే హక్కు లేదు. ఒక వేళ అలా చేస్తే డాక్టరుతో పాటు ఆ మహిళ కూడా జైలు పాలౌతుంది. ఈ అంశమే నన్ను కదిలించివేసింది. తనను కలిసినప్పుడల్లా ఏదో అపరాధభావం నన్ను వెంటాడింది. ఆ సమయంలో చట్ట ప్రకారం సరిగ్గానే ప్రవర్తించాను. కానీ నైతికంగా తప్పు చేశానని బాధపడేవాడ్ని’ అని పదే పదే నాటి సంఘటనను గుర్తు చేసుకుంటున్న నిఖిల్‌ లాంటి వైద్యులు చాలా అరుదుగా కనిపిస్తారు.
ప్రస్తుతం వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. చట్ట ప్రకారం నిర్దేశించిన గడువు దాటినా సురక్షితంగా గర్భస్రావం చేసే వీలుంది. కానీ కొన్ని రోజులు, కొన్ని వారాల తేడా ఉన్నా గర్భస్రావం నిరాకరిస్తున్నారు. దీంతో మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేని బిడ్డలతో ఆ కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారమే నిఖిల్‌ ఆలోచించారు. చట్ట సవరణ చేయాలని గర్భస్రావ గడువు పెంచాలని సుప్రీం కోర్టు వరకు వెళ్లారు.

నిర్ధిష్ట కారణం లేదు..
1996లో గైనకాలజిస్ట్‌గా వైద్య సేవలు ప్రారంభించిన నిఖిల్‌ వృత్తిలో భాగంగా ఎంతోమంది గర్భిణీలకు వైద్యం అందించారు. వారిలో కచ్చితంగా గర్భస్రావం చేయాల్సిన మహిళలు కూడా ఉండేవారు. గుండె, ఉదర అంతర్గత అవయవాలు ఎదగని పిండాలను ఆయన ఎన్నో గుర్తించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గర్భం దాల్చిన కొన్ని నెలల వరకు ఆస్పత్రులను సందర్శించరు. వచ్చినా అక్కడ అరకొర సదుపాయాలతో సోనోగ్రఫీ అందుబాటులో ఉండదు. ఫలితంగా సరైన సమయంలో సరైన పరీక్షలు జరగక పిండంలోని లోపాలు గుర్తించడం కష్టమౌతుంది. గుర్తించేసరికి గర్భస్రావ గడువు తీరిపోతుంది. ప్రసవం తరువాత ఆ మహిళ, ఆ బిడ్డతో ఎంతో వేదన పడుతుంది. ఈ సంఘటనలు చూసిన నేను చట్టంలో నిర్దేశించబడిన గర్భస్రావ గడువుపై పరిశోధన చేశాను. ఆ గడువు ఎందుకు నిర్దేశించారో నాకు కనబడలేదు. అది కేవలం ఏకపక్ష నిర్ణయం. దాని ప్రకారం 19 నెలల గర్భిణీకి గర్భస్రావం చేయడానికి క్షణం ఆలోచించని వైద్యులు, 20 వారాలు దాటి ఒక్క రోజైనా నిరాకరిస్తారు. అసలు గర్భస్రావ అవసరం ఎందుకు వచ్చింది? సరిగ్గా ఎదగని పిండానికి జన్మనివ్వడం ఎంత విషాదం! గడువు దాటినా వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆ గర్భాన్ని తొలగించవచ్చు. కానీ చట్టం పేరుతో దశాబ్దాల తరబడి అది నిరాకరిస్తున్నారు’ అంటున్న నిఖిల్‌ ఈ అంశాన్ని ఎన్నో జాతీయ వైద్య సమావేశాల్లో చర్చించారు. ఎంటిపి చట్ట సవరణ ఆవశ్యకతపై గళమెత్తారు. కానీ ఈ చర్చలన్నీ ఆ సమావేశాలకే పరిమితమయ్యాయి.

మలుపుతిప్పిన ఘటన..
2008లో నిఖిల్‌ దగ్గరకు నికేతా మెహతా వచ్చారు. అప్పటికే ఆమె 24 వారాల గర్భిణీ. పిండం ఎదుగుదల సరిగ్గా లేదని వైద్య పరీక్షల్లో తేలింది. గర్భస్రావం చేయించుకోవాలని ఆమె నిశ్చయించుకుంది. చట్టం అందుకు ఒప్పుకోలేదు. దాన్ని సవాలు చేస్తూ నికేతా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే నికేతాతో పాటు నిఖిల్‌ కూడా కేసు ఫైల్‌ చేశారు. ఎన్నో ఏళ్ల నుండి పడుతున్న సంఘర్షణకు ఇదే మంచి అవకాశమని ఆయన భావించారు. అందుకే కోర్టులో ఆ కేసు కొట్టేసినా, చట్ట సవరణ కోసం ఎంత కాలమైనా పోరాడాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు.


న్యాయవాదిగా పరిశోధించారు..
2016లో నిఖిల్‌కి మరో సంఘటన ఎదురైంది. అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక గర్భందాల్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో ఆ బాలికను నిఖిల్‌ దగ్గరకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భస్థ పిండం మెదడు పనితీరులో లోపం ఉంది. ప్రసవం అయ్యేవరకు ఆ బిడ్డ గర్భంలో సజీవంగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రసవం అయి, బొడ్డుతాడు కోస్తోమో అప్పుడే ఆ బిడ్డ చనిపోతుంది. కాబట్టి గర్భస్రావం ఒక్కటే మార్గం. కానీ ఆ బాలికను నా దగ్గరికి తీసుకొచ్చేనాటికి చట్ట ప్రకారం గడువు దాటిపోయింది. ఈ అంశాన్నే చాలా బలంగా వాదించాలనుకున్నాను. కచ్చితంగా గర్భస్రావం అవసరమైన 320 మంది మహిళలతో సుప్రీంకోర్టులో మరోసారి పిల్‌ వేశాను’ అంటున్న నిఖిల్‌ ఈసారి వైద్యుడిలా కాకుండా, న్యాయశాస్త్రంలో పట్టాపొందిన అనుభవంతో ఓ న్యాయవాదిగా కేసును పరిశోధించారు. 14 ఏళ్ల పాటు ఈ కేసుపై పనిచేశారు. ఎట్టకేలకు 2021లో ఎంటిపి చట్టంలో సవరణ తెచ్చారు. గర్భస్రావ గడువు 20 వారాల నుండి 24 వారాలకు పొడిగించారు. ‘ఎన్నో కోట్లాది జీవితాలను ప్రభావితం చేసే ఒక విధాన మార్పుకై శ్రమించానన్న తృప్తి నాకుంది’ అంటున్న నిఖిల్‌ లాంటి వైద్యులు చాలా అరుదు.

➡️