‘నకిలీ’ ప్రచారాలు 

Dec 28,2023 10:23 #Alt News, #BJP Govt, #fake
fake news propaganda

 

‘డీప్‌ఫేక్‌’ టెక్నాలజీ మాయాజాలం

‘ఏఐ’తో లేనిది ఉన్నట్టుగా వీడియోలు, ఆడియోలు తయారు

ప్రత్యర్థులపై అడ్డదారుల్లో దుష్ప్రచారాలు

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఎత్తుగడలు

ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడని నేతలు

డిజిటల్‌, టెక్‌ సంస్థలకు రూ. లక్షల్లో చెల్లింపులు

2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాలపై

ఆంగ్ల వార్త సంస్థ దర్యాప్తులో బహిర్గతం

  • ప్రముఖ సాంకేతిక నిపుణులు, దిగ్గజ టెక్‌ సంస్థల అధినేతలు చెప్పినట్టుగానే కృత్రిమ మేథ (ఏఐ) ప్రమాదకరంగా మారుతున్నది. ‘డీప్‌ఫేక్‌’తో నకిలీ వీడియోలు, ఆడియోలు తయారు చేస్తున్న తీరు ఈ మధ్యకాలంలో అధికమైంది. అది క్రమంగా రాజకీయ రంగానికీ పాకింది. భారత్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు డీప్‌ఫేక్‌ టెక్నాలజీని కృత్రిమంగా ఉపయోగించటం ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటానికి డిజిటల్‌ మానిప్యులేటర్లు రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒక జాతీయ ఆంగ్ల వార్త సంస్థ దర్యాప్తులో ఇది బహిర్గతమైంది.

న్యూఢిల్లీ : ప్రపంచంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశోధకులు, టెక్‌ సంస్థల అనేక నూతన ఆవిష్కరణలు మనిషికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే, సదరు టెక్నాలజీ మనిషి పురోగతికి ఉపయోగపడాలి. కానీ, టెక్నాలజీని చెడు దారిలో ఉపయోగిస్తుండటంతో దాని ప్రతికూల ప్రభావం తిరిగి సమాజం పైనే పడుతున్నది. ఏఐతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ కంటెంట్‌ దీనికి ఉదాహరణ అని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. భారత్‌లో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు డీప్‌ఫేక్‌ వినియోగం అధికమైందని చెప్తున్నారు.ఆంగ్ల వార్త సంస్థ దర్యాప్తు ప్రకారం.. నోయిడాలోని ది డిజిటల్‌ పబ్లిసిటీ వ్యవస్థాపకుడు రోహిత్‌ పాల్‌తో విచారణ ప్రారంభమైంది. ఆయన 2024 ఎన్నికలకు బరిలో ఉండగలికే అభ్యర్థులను గుర్తించటంం, వారి ప్రచారాలను వ్యూహాత్మకంగా ప్లాన్‌ చేయడం వంటి తన కార్యకలాపాలను వివరించాడు. ప్రత్యర్థులను కించపరిచేలా డీప్‌ఫేక్‌ వీడియోలను రూపొందించటంపై పాల్‌ ప్రాథమిక దృష్టి ఉన్నది. ”మేము ఆన్‌లైన్‌ చిత్రాలను మెరుగుపర్చి వాటిని సానుకూల చిత్రాలుగా రూపొందిస్తాం. యానిమేటెడ్‌ వీడియోలను తయారు చేస్తాం. ఇతర పార్టీల అభ్యర్థుల తప్పులను ప్రదర్శిస్తాం. వారిని మూర్ఖులుగా చూపుతాం” అని ఆయన అన్నారు. ఈ ఏఐ రూపొందించిన వీడియోల గుర్తింపు గురించి అడిగినప్పుడు.. ”వ్యక్తులు కంటెంట్‌ను నకిలీ అని గుర్తించడం సవాలుతో కూడుకున్నది. సగటు వ్యక్తి దానిని గుర్తించలేరు. ఇది పూర్తిగా ప్రామాణికమైనదిగా కనిపిస్తుంది” అని తెలిపారు. డీప్‌ఫేక్‌ మెటీరియల్‌ని రూపొందించడానికి ఎంత సమయం పడుతుందో కూడా పాల్‌ చెప్పారు. ” మొత్తం పనిని ఏఐ నిర్వహిస్తుంది కాబట్టి ఇది ఎక్కువ సమయం తీసుకోదు. మేము కేవలం ఆదేశాలను జారీ చేస్తాం. సాధనాలు వాటికవే మిగిలిన పనిని నిర్వహిస్తాయి” అని అతను స్పష్టం చేశాడు.ప్రతి అభ్యర్థి నెలకు రూ. 5 లక్షలు చెల్లిస్తాడని పాల్‌ చెప్పాడు. అభ్యర్థి ప్రత్యర్థుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు డీప్‌ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి ఇంటిమేట్‌ వీడియోలను రూపొందిస్తామన్నాడు. ”మేము మొదట వాటిని సోషల్‌ మీడియాలో ఉపయోగించుకుంటాం. వ్యూహాత్మకంగా డీప్‌ఫేక్‌లు, కాల్‌ రికార్డింగ్‌లను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై మేము అభ్యర్థుల నుంచి ఆదేశాలు అందుకుంటాం” అని పాల్‌ వివరించారు. ఈ అప్‌లోడ్‌ల మూలాల గురించి ఆందోళనలు తలెత్తితే.. మేము భారత్‌లో పని చేస్తున్నప్పుడు యూఎస్‌లో ఉన్నాము అనే అభిప్రాయాన్ని సృష్టించటానికి మా ఐపీ చిరునామాను మారుస్తామని తెలిపాడు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి అభ్యర్థికి చెందిన వాయిస్‌ ఏదైనా సృష్టించగలమనీ, ఇది కచ్చితంగా సదరు అభ్యర్థి వాయిస్‌ను పోలి ఉంటుందని చెప్పాడు. ఇలాంటి టెక్నాలజీతో ఎన్నికల ప్రసంగాలను తారుమారు చేస్తున్నారని రోహిత్‌ వివరించాడు. ఇలాంటివి చాలా సులభమని చెప్పాడు. పొలిటికల్‌ డీప్‌ఫేక్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నదన్నాడు. ” విపక్షాలను మట్టికరిపించాలనే డిమాండ్‌ రాజకీయ పార్టీల్లో ఉన్నది. మీరు వేరొకరి వాయిస్‌ని ట్యాంపర్‌ చేస్తే, అది పట్టుకోవచ్చు. పూర్తిగా ఏఐతో రూపొందించిన వీడియోలను నకిలీవని గుర్తించటం అంత సులభం కాదు” అని ఆయన వివరించారు. ఈ డిజిటల్‌ మాయా విద్యకు సంబంధించి అనేక సంస్థలు పని చేస్తుండటం గమనార్హం.

➡️