హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వైఫల్యం !

Dec 4,2023 11:47 #Congress, #Failure, #Hindi states

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : హిందీ భాషా రాష్ట్రాల్లో బిజెపిని ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని మరోసారి రుజువైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో స్వల్ప మెజారిటీతోనూ, చత్తీస్‌గఢ్‌లో పూర్తి మెజారిటీతోనూ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. 25 లోక్‌సభ స్థానాలున్న రాజస్థాన్‌లో 2014, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 29 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 2014లో రెండు, 2019లో ఒకటి గెలుచుకుంది. 11 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 2014లో ఒకటి, 2019లో రెండు స్థానాలే గెలుపొందింది. హిందీ రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలున్న చిన్న రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది. హిందీ రాష్ట్రాల్లో గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌ ప్రభావం కోల్పోయింది. ఇక్కడ బిజెపి మతతత్వ ఫాసిజాన్ని ఎస్‌పి, ఆర్‌జెడి, జెడియు వంటి సోషలిస్టు పార్టీలు తిప్పికొడుతున్నాయి. జార్ఖండ్‌లో బిజెపికి వ్యతిరేకంగా హేమంత్‌ సోరన్‌కు చెందిన జెఎంఎం ఉంది. యుపిలో కాంగ్రెస్‌కు కంచుకోటలైన రారుబరేలీ, అమేథీల్లోనూ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 2019లో అమేథీలో బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌గాంధీ ఓడిపోయారు. ఎస్పీ మద్దతుతో సోనియా గాంధీ రారుబరేలీలో గెలవగలిగారు. హర్యానా వంటి ఇతర హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గత రెండు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చేతిలో ఓడిపోతూనే ఉంది. ఉత్తరాఖండ్‌లో కూడా రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనితీరు దయనీయంగా ఉంది. ఉత్తర భారతదేశంలో భాగమైన గుజరాత్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి సులువుగా విజయం సాధిస్తోంది. కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ఎస్‌పి, ఆర్‌జెడి వంటి పార్టీలు, దక్షిణాది రాష్ట్రాలు బిజెపి మతతత్వాన్ని ప్రతిఘటిస్తున్నాయి.

సైద్ధాంతిక పోరు కొనసాగుతుంది : రాహుల్‌ గాంధీ

”మూడు రాష్ట్రాల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరించాం.” అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, సైద్ధాంతిక పోరు మాత్రం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణాలో అధికారాన్ని కట్టబెట్టినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు.

➡️