‘ఉపాధి’ కార్మికులకూ ముఖ హాజరు

  • అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు
  • సాంకేతిక సమస్యలు ఎదురైతే హాజరు గల్లంతే
  • ఆందోళనల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : జాతీయ ఉపాధి హామీ పథకంలో కార్మికులకు ఆధార్‌ ఆధారిత ముఖ హాజరు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అయిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు అమలైన ఈ విధానం ఉపాధి కార్మికులకు అమలు చేయడంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫీల్డ్‌ అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్‌ ఫోన్‌లోని యాప్‌ ద్వారా కార్మికుల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు.

తూర్పుగోదావరి జిల్లాలో 300 పంచాయతీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.96 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. 5.26 లక్షల మంది కూలీలుఉన్నారు. 1.31లక్షల జాబ్‌ కార్డులకు సంబంధించి 1.95 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. 2023-2024కు సంబంధించి 53.29లక్షల పనిదినాలు లక్ష్యంగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదుకే ప్రాధాన్యం ఇస్తారని స్పష్టమవుతోంది. పెద్ద పంచాయతీలలో సుమారు 400 నుంచి 500 మంది కూలీలు పనిచేస్తుంటారు. వీరందరికీ ఫేస్‌యాప్‌లో హాజరు వేయడం సాధ్యమేనా అనే సందేహమూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటాడుతోంది. ఇప్పటి వరకూ పని కోరిన కార్మికులకు ఒక్క రోజు ముందు వారికి ఎక్కడ, ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఆ పని జరిగినన్ని రోజులూ ముందుగా నమోదు చేసిన కార్మికుల్లో రోజూ ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్‌లో హాజరైనట్టు టిక్‌ చేయాలి. కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఒక ఫొటో తీసి దానిని కూడా ఆ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పుడు వచ్చే కొత్త విధానంలో కార్మికుల హాజరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మొబైల్‌ యాప్‌లో టిక్‌ రూపంలో నమోదు చేసే బదులు, ఆ కార్మికుని ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్‌లో నమోదైన ఫొటోతో ఈ ఫొటో సరిపోతేనే హాజరు పడేలా మొబైల్‌ యాప్‌లో సాప్ట్‌వేర్‌ను ఆధునికీకరించనున్నారు. కొత్త విధానంలో పని ప్రాంతంలోనే ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆయా కార్మికుల ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నూతన విధానం అమలైతే ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు ఇప్పటికే వెంటాడుతూనే ఉన్నాయి. ముఖహాజరు వేయాలంటే సిగల్స్‌ ఉన్న ప్రాంతానికి వచ్చి వేయాల్సి ఉంటుంది. కార్మికులను వెంటబెట్టుకుని మైదాన ప్రాంతాలకు వెళ్లి అక్కడ హాజరు తీసుకుని తిరిగి పనిప్రదేశానికి తీసుకెళ్లడం కష్టసాధ్యమని ఫీల్డ్‌ అసిస్టెంట్లు చెబుతున్నారు. అంతేకాకుండా అందరి ముఖ హాజరు వేయడానికి పూటకుపైగా పట్టే అవకాశం ఉండటంతో అటు కార్మికుల్లోనూ, ఇటు ఫీల్డ్‌ అసిస్టెంట్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎలాంటి ఆదేశాలు రాలేదు

ఉపాధి కార్మికులకు ఫేష్‌ యాప్‌ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వస్తే నిబంధనల ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. – జగదాంబ, డ్వామా పిడి, తూర్పుగోదావరి జిల్లా

➡️