ఆరోగ్యకరమైన ఆహారం అందటంలేదు : ఎఫ్‌ఏఓ నివేదిక

Dec 14,2023 09:27 #Food, #Report
fao report on healthy food india

74.1 శాతం మంది భారతీయుల పరిస్థితిది
పోషకాహారలోపంతో ప్రజలు

న్యూఢిల్లీ : భారత్‌లో ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు లభించటం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినా.. పౌష్టికాహారం భారతీయులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. భారతత్‌లో దాదాపు 74 శాతం మంది భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఫ్‌ఏఓ.. ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రీషన్‌ 2023 ప్రాంతీయ అవలోకనాన్ని ఆవిష్కరించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. 2021లో 74.1 శాతం మంది భారతీయులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. 2020లో ఇది శాతం 76.2గా ఉన్నది. పొరుగుదేశాలైన పాకిస్థాన్‌లో ఇది 82.2 శాతం, బంగ్లాదేశ్‌లో 66.1 శాతం జనాభా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెరుగుతున్న ఆహార ఖర్చులు, ప్రజల ఆదాయంతో సరిపోలకపోవటంతో ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని పరిస్థితికి దారితీస్తున్నదని నివేదిక హెచ్చరించింది. కోవిడ్‌19 మహమ్మారి, 5ఎఫ్‌(ఆహారం, ఫీడ్‌, ఇంధనం, ఎరువులు, ఆర్థికం) సంక్షోభం సమయంలో ప్రపంచ దేశాలు భయంకరమైన పరిస్థితులను ఎదురు చూశాయని నివేదిక వెల్లడించింది.

”ఆసియా, పసిఫిక్‌ ప్రాంతం ప్రపంచంలోని తీవ్రమైన ఆహార అభద్రతలో సగభాగాన్ని కలిగి ఉన్నది. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు ఆహార అభద్రతతో ఉన్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో పెరుగుదల, ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, అధిక బరువు, అలాగే పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో రక్తహీనత వంటి ప్రాబల్యం రేట్లు ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ(డబ్ల్యూహెచ్‌ఏ) ప్రపంచ పోషకాహార లక్ష్యాల పరంగా ఇప్పటికీ మార్కులకు దూరంగా ఉన్నాయి” అని నివేదిక పేర్కొంది. భారతదేశ జనాభాలో 16.6 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. ”దక్షిణాసియా తీవ్రమైన ఆహార అభద్రత అధిక ప్రాబల్యాన్ని చూపించింది. ఇది తూర్పు ఆసియాలో తీవ్రమైన ఆహార అభద్రత అతి తక్కువగా ఉన్నది. ప్రపంచంతో పోలిస్తే, దక్షిణాసియాలో 2015 నుంచి తీవ్రమైన ఆహార అభద్రత ఎక్కువ శాతం ఉన్నది” అని నివేదిక పేర్కొన్నది.

భారత్‌లో ఐదేండ్లలోపు పిల్లల్లో 31.7 శాతం మంది ఎదుగుదల మందగమనంతో బాధపడుతున్నారు. ఎత్తుకు తక్కువ బరువు ఐదేండ్లలోపు 18.7 శాతం మంది పిల్లలు ఈ ప్రధాన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. దేశంలోని 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో 53 శాతం మందికి రక్తహీనత ఉన్నది. ”ఇది (రక్తహీనత) మహిళల్లో ఆరోగ్యం, శ్రేయస్సును దెబ్బతీస్తుంది. ప్రతికూల ప్రసూతి, నవజాత ఫలితాల ప్రమాదాన్ని పెంచుతుంది” అని నివేదిక హెచ్చరించింది. దేశంలోని పెద్దలలో 1.6 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 0-5 నెలల వయస్సు గల శిశువులలో తల్లిపాలు ఇవ్వడంలో భారతదేశం 63.7 శాతంతో ఉన్నది.

➡️