ముమ్మాటికీ కోడ్‌ ఉల్లంఘనే

  • రాజస్థాన్‌లో ముస్లింలపై విషం చిమ్మిన మోడీ 
  • బహు సంతానం కలిగిన సమాజమంటూ ఛీత్కారం
  • చొరబాటుదారులంటూ నిందలు శ్రీ మోడీ పై చర్యకు ప్రతిపక్షాల డిమాండ్‌

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో చేసిన ప్రసంగం 30 ఏళ్లలో అత్యంత విద్వేషపూరితమైనదని, ఇందుకుగాను ఆయనపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో మోడీ అవే వ్యాఖ్యలను సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ సభలో రిపీట్‌ చేశారు. ప్రధాన మంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఒక మతాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ విధంగా విద్వేషాలను రెచ్చగొట్టడం ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే. ముస్లింలపై విషం గక్కిన మోడీ ప్రసంగంపై కేసు నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించడం, ఇటువంటి ప్రసంగాలపై కొరడా ఝుళిపించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండడం వల్లే ఆయన అంతకంతకూ రెచ్చిపోతున్నారు. రాజకీయ లబ్ధి కోసం సమాజంలో విద్వేషాలను రెచ్చగొడుతున్న మోడీ పై ఎన్నికల సంఘం వెంటనే చర్య తీసుకోవాలని రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు, ఎన్నికలవాచ్‌డాగ్‌ ఎడిఆర్‌ వంటివి డిమాండ్‌ చేశాయి. చివరికి దీర్ఘకాలం బిజెపితో చెలిమి చేసి రైతు ఉద్యమం సందర్భంగా తెగతెంపులు చేసుకుని బయటకొచ్చిన శిరోమణి అకాలీదళ్‌ కూడా మోడీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాన్స్‌వాడా ఎన్నికల బహిరంగ సభలో మోడీ చేసిన ఎన్నికల ప్రసంగం ముస్లింలపై విషం చిమ్మింది. ”దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు అధికారమిస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కువమంది పిల్లలను గనేవారికి పంచిపెడతారు. వారు చొరబాటు దారులకు పంపిణీ చేయాలని అనుకుంటున్నారు. మీరు దీనిని అంగీకరిస్తారా?” అని ర్యాలీలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని అసందర్భంగా, తప్పుడు రీతిలో ఉదహరించారు. వనరులపై ముస్లింలకు మొదటి హక్కు ఉండాలని మన్మోహన్‌ సింగ్‌ గతంలో ఎప్పుడో అన్నట్లు మోడీ ఇప్పుడు చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్‌ను ఎన్నుకుంటే గిరిజనుల సంపదను ‘చొరబాటుదారుల’కు ధారాదత్తం చేస్తుందని హెచ్చరించారు. మైనారిటీ ముస్లింలను బిజెపి నేతలు తరచూ చొరబాటుదారులుగా అభివర్ణిస్తుంటారన్న విషయం తెలిసిందే. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా మత విద్వేష ప్రచారానికి అంబాసిడర్‌గా ఎలా వ్యవహరించిందీ చూశాం. ప్రధాని హోదాలో అంతకన్నా దారుణమైన రీతిలో ఆదివారం ఆయన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం ఆంగ్ల అనువాదం అధికారిక వెబ్‌సైటులో ఉంచారు. ‘కాంగ్రెస్‌ పార్టీ మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను సైతం లాక్కొని ముస్లింలకు ఇస్తుంది’ అనే రెచ్చగొట్టే వ్యాఖ్యలను అందులోంచి తొలగించారు.

వాస్తవిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ!
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వాకిట నిలవడం కష్టమేనని బిజెపి నాయకత్వానికి అర్థమైపోయింది. బిజెపి అయోధ్యలో నూతన రామమందిర నిర్మాణ అంశాన్ని ముందుకు తెచ్చి ప్రతిపక్షాలపై హిందూ వ్యతిరేకులుగా, ముస్లిం అనుకూలురుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి మందిర నిర్మాణం ఒక సమర్ధవంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని బిజెపి తొలుత భావించింది. కానీ అది ఫలించేలా లేదు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగులో తక్కువ ఓటింగ్‌ శాతం నమోదు కావడం దీనినే తెలియజేస్తోంది.. ఎన్డీయే యేతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలతో పోలిస్తే ఎన్డీయే సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలలోనే ఓటింగ్‌ శాతం బాగా తక్కువగా నమోదు అయిందని, తమ జీవనానికి సంబంధించిన అంశాలకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దీనివల్ల అర్థమవుతోందని రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తల్లో సైతం ఎక్కడా ఉత్సాహం కన్పించడం లేదు.
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఇచ్చిన ఓ ప్రకటనను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముస్లింలకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ఆయన నిరాకరించారు. ‘మేము ఇద్దరం…మాకు పాతిక మంది’ అని నమ్మే ఓ సమాజానికి ఈ శిబిరాలు సంతాన కేంద్రాలుగా మారడం తనకు ఇష్టం లేదంటూ ముస్లింలను అవమానించారు. ఆనాడు మత ఘర్షణల్లో బాధితు లైన ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన విద్వేషాలను ఎలా రెచ్చగొట్టారో ఇప్పుడు కూడా బాన్స్‌వారాలో అదే పని చేశారు. ముస్లిం శరణార్థులను చొరబటు దారులుగా అభివర్ణించారు. ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి ఇది విరుద్ధంగా ఉంది. ఈ చట్టం దేశంలోని ముస్లిమేతర శరణార్థులను స్వాగతించడమే కాకుండా వారికి భారత పౌరసత్వాన్ని కల్పిస్తామని గ్యారంటీ ఇచ్చింది.

అనుమానాలు రేకెత్తిస్తున్న ఇసి విశ్వసనీయత
పౌర సమాజ సంస్థలు, ఏడీఆర్‌ ఎన్నికల పరిశీలకుడు జగదీప్‌ చక్రవరి ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఓ ఫిర్యాదు పంపారు. మోడీ ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123 (3), (3ఏ), 125 సెక్షన్లకు కూడా విరుద్ధంగా ఉన్నదని ఆయన అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 153-ఏను కూడా ఇది ఉల్లంఘిస్తోందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఎలాంటి కాలయాపన లేకుండా వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పటికే దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన ఇసి, ఏవైనా చర్యలు తీసుకుంటుందా అన్నది అనుమానమే. సాక్షాత్తూ ప్రధానమంత్రే హిందూ ఓట్లను దండుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రచారానికి దిగుతుంటే ఎన్నికల సంఘం గుడ్లప్పగించి చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా తన స్వతంత్రతపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. తద్వారా ప్రజల దృష్టిలో దానిపై కొంత నమ్మకం ఏర్పడుతుంది.

మోడీపై చర్య తీసుకోవాలి : ఎక్స్‌లో సీతారాం ఏచూరి ట్వీట్‌
”రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత ప్రసంగం ఎన్నికల నియమావళిని బాహాటంగా ఉల్లంఘించడమే. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును చేపట్టాలి. మోడీ వ్యాఖ్యలు దారుణం. ఎన్నికల కమిషన్‌ మౌనం మరింత దారుణం. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఇది ఉల్లంఘిస్తోంది. ఇది కఠిన చర్యలకు, కోర్టు ధిక్కరణకు యోగ్యమైనది’

నో కామెంట్‌…

  •  మోడీ ప్రసంగంపై ఇసి సమాధానం ఇదే
  •  కమిషన్‌ స్వతంత్రతపై కమ్ముకుంటున్న నీలినీడలు

ఆదివారం రాజస్థాన్‌లోని ఓ ఎన్నికల బహిరంగ సభలో మోడీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మాత్రం మౌనాన్ని వీడడం లేదు. మోడీ ప్రసంగంపై మాట్లాడాల్సిందిగా సోమవారం ఉదయం నుండి పలువురు మీడియా ప్రతినిధులు పదేపదే ప్రశ్నించినప్పటికీ ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి నుండి ఒకే ఒక సమాధానం వస్తోంది. అదేమిటంటే ‘వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నాము’. ఎన్నికల కమిషన్‌ ఇంతకుముందు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు నోటీసు ఇచ్చింది. ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన ‘హిందూ’, ‘జై భవాని’ పదాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. అయితే అందుకు ఉద్ధవ్‌ నిరాకరించారు. ముందుగా మోడీకి నోటీసు పంపాలని ఇసికి సలహా ఇచ్చారు. ఏదేమైనా ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల కమిషన్‌ పైనే ఉంది. దాని స్వతంత్రతపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రసంగం తప్పుడు వాదనలు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో నిండి ఉంది. ఇంతకంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన మరొకటి ఉండబోదు..

➡️