పోరుబాటలో ఐరోపా రైతాంగం, అనేక దేశాల్లో రోడ్ల దిగ్బంధనం !

Feb 2,2024 07:17 #Editorial

ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీలన్నీ సిద్ధం అవుతుండగా వివిధ దేశాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు. నిన్న జర్మనీ, రుమేనియాలో, నేడు ఫ్రాన్సు, ఇతర దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ రైతులు మన మాదిరిగా జెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేయటానికి బదులు ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాటితో వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ వంటి వాటిలో నిరసన వీడియోలు నింపుతూ ప్రచారంలో పెడుతున్నారు. ఐరోపా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షిస్తున్న పదాల జాబితాలో ”రైతులు” కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతున్నది.

              బ్రసెల్స్‌లో జరుగుతున్న ఐరోపా యూనియన్‌ సమావేశాల సందర్భంగా తమ నిరసన వెల్లడిస్తూ బెల్జియం, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర దేశాల్లో రైతులు (జనవరి 31) బుధవారం నాడు ఆందోళనకు దిగారు. నౌకాశ్రయాలు, ఇతర ఆర్థిక కేంద్రాలలో లావాదేవీలను జరగకుండా చేశారు. అనేక చోట్ల ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలతో రోడ్లను దిగ్బంధనం చేశారు. బ్రసెల్స్‌ నగరంలో ప్రవేశించేందుకు రైతులు పెద్ద ఎత్తున నలుమూలల నుంచీ తరలి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అనేక చోట్ల పౌర జీవనానికి కూడా ఆటంకం కలిగింది. రైతుల సమస్యలను వినాల్సి ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డెకరో అన్నాడు. వాతావరణ మార్పుల నుంచి పర్యావరణ కాలుష్యం వరకు అనేక పెద్ద సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా దక్షిణ అమెరికా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ ప్రకటించాడు. ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీలన్నీ సిద్ధం అవుతుండగా వివిధ దేశాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు. నిన్న జర్మనీ, రుమేనియాలో, నేడు ఫ్రాన్సు, ఇతర దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ రైతులు మన మాదిరిగా జెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేయటానికి బదులు ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాటితో వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ వంటి వాటిలో నిరసన వీడియోలు నింపుతూ ప్రచారంలో పెడుతున్నారు. ఐరోపా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షిస్తున్న పదాల జాబితాలో ”రైతులు” కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతున్నది.

ఐరోపా యూనియన్‌ దేశాల్లో రుమేనియాలో అత్యధికంగా 35 లక్షల మంది రైతులు ఉన్నారు. జనవరి పది నుంచి వీరితో పాటు రవాణా రంగ కార్మికులు అనేక సందర్భాలలో కలిసే ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమర్పించిన 47 డిమాండ్ల జాబితాలో డీజిల్‌ పన్ను తగ్గింపు, మోటారు వాహనాలపై పౌర సంబంధ బీమా ప్రీమియం తగ్గింపు వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం ముందుకు తెచ్చిన ప్రధాన అంశాలు ఉన్నాయి. ఐరోపా దేశాల్లో రవాణాకు పర్మిట్లు అవసరం, ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత వాటిని ఎత్తివేశారు. దాంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉండే ఉక్రెయిన్‌ వాహనాల నుంచి వచ్చిన పోటీని రుమేనియా, ఇతర దేశాల ట్రక్కుల యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు, అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా మిగతా దేశాల్లో ధరలు పడిపోయి రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదు. రుమేనియా రాజధాని బుఖారెస్ట్‌లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని జనవరి పదిన అడ్డుకున్నారు. దాంతో ఇరవై కిలోమీటర్ల పొడవున రైతులు భైఠాయించారు. పది రోజుల తరువాత 21వ తేదీన అనుమతి ఇచ్చారు. అంతకు ముందు ఉక్రెయిన్‌తో రెండు చోట్ల సరిహద్దులను రైతులు దిగ్బంధించారు. మన దేశంలో నిరసన తెలిపిన వారిని రైతులు కాదని ఎలా నిందించారో రుమేనియాలో కూడా అదే జరిగింది. సాధారణ రైతులతో పాటు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా బాసటగా నిలిచారు.

నాలుగు శాతం భూమిని సాగు చేయకుండా వదలి వేయాలని, పంటల మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై శాతం తగ్గించాలనే నిబంధనలను ఐరోపా యూనియన్‌ అమలు చేయనుంది. దీని వలన ప్రపంచంలో ఇతర రైతులతో చౌకగా వచ్చే దిగుమతులతో తాము పోటీ పడలేమని స్థానిక రైతులు చెబుతున్నారు. దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా తమకు నేరుగా ఇచ్చే నగదు విలువ కూడా తగ్గుతున్నదని ఆందోళన వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఐరోపా అంతటా రైతాంగాన్ని ప్రభావితం చేయటంతో వారు వీధుల్లోకి వస్తున్నారు. ఉక్రెయిన్‌లో సగటు కమతా విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు కాగా, ఐరోపా ఇతర దేశాల సగటు కేవలం 41 హెక్టార్లు మాత్రమే. అందువలన గిట్టుబాటులో కూడా తేడా ఉంటున్నది. ఉక్రెయిన్‌ దిగుమతులను నిరసిస్తూ పోలాండ్‌ రైతులు జనవరి 24న దేశవ్యాపితంగా ఆందోళన చేశారు. ఉక్రెయిన్‌ ధాన్యాన్ని ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు పంపాలి తప్ప ఐరోపా దేశాలకు కాదని పోలాండ్‌ రైతు సంఘ ప్రతినిధి చెప్పాడు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు స్పెయిన్‌, ఇటలీ, పోర్చుగీసు రైతులు ప్రభావితం కాలేదని, అయితే పర్యావరణ రక్షణ చర్యలు వారిని కూడా వీధుల్లోకి తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. స్పెయిన్‌, పోర్చుగీసులో కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా వ్యవసాయానికి వాడే నీటి పరిమాణం మీద ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. జరిగిన నష్టాలకు తమకు పరిహారం ఇవ్వటం లేదని రైతులు విమర్శించారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ముందుకు వస్తుండటంతో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఐరోపా దేశాల్లో రైతులు రోడ్లెక్కటం ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగమంటూ నత్రజని వాయువు విడుదలను పరిమితం చేసేందుకు పూనుకోవటంతో 2019లో నెదర్లాండ్‌ అంతటా రైతులు రోడ్లను దిగ్బంధించారు. గతేడాది డిసెంబరులో కూడా నిరసన తెలిపారు. ఉక్రెయిన్‌ డ్రైవర్లకు పర్మిట్‌ పద్ధతి అమలు జరపాలని కోరుతూ పోలాండ్‌ ట్రక్కరు సరిహద్దులను మూసివేసి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న చౌక దిగుమతులను అడ్డుకోవాలని రైతులు జనవరి ప్రారంభంలో వీధుల్లో ప్రదర్శనలు చేశారు. వ్యవసాయ సబ్సిడీల కోత ప్రతిపాదనలకు నిరసనగా వేలాది మంది జర్మన్‌ రైతులు బెర్లిన్‌ను దిగ్బంధం చేశారు. తాజాగా ఫ్రాన్సులో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, కొన్ని చోట్ల హింసారూపం తీసుకుంది.

వివిధ దేశాల నుంచి చౌకగా దిగుమతులు చేసుకుంటూ తమ పొట్టగొడుతున్నారని ఆగ్రహించిన ఫ్రెంచి రైతులు తమ దేశం గుండా స్పెయిన్‌ నుంచి మొరాకో వెళుతున్న వైన్‌, కూరగాయల రవాణా ట్రక్కులను అడ్డుకొని ధ్వంసం చేశారు. తమను ఫణంగా పెట్టి మాక్రాన్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పూనుకుందని, ఫలితంగా ఆహార ఉత్పత్తిదారులు ధరలను తగ్గించాల్సి వచ్చిందని, హరిత విధానాల పేరుతో తీసుకుంటున్న చర్యలు కూడా తమను దెబ్బ తీస్తున్నాయని రైతులు నిరసన తెలుపుతున్నారు. జీవ వైవిధ్యం పేరుతో ఐరోపా యూనియన్‌ నుంచి సహాయం పొందాలంటే నాలుగు శాతం భూమిని ఖాళీగా ఉంచాలని, రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలనే షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇటలీ నుంచి వస్తున్న కమలాలు కిలో 6.3 డాలర్లకు లభిస్తుండగా పురుగుమందులు తక్కువ వాడుతున్న కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన తమ సరకు 8.57 డాలర్లకు విక్రయించాల్సి వస్తున్నందున పోటీ ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులు ఇద్దరూ నష్టపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 82 శాతం మంది పౌరులు రైతాంగానికి మద్దతు తెలిపారు. ఫ్రాన్సులో మూడో వంతు మంది రైతులు దారిద్య్ర రేఖకు దిగువున ఉండగా సగటున రోజుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పర్యావరణవేత్త యానిక్‌ జడోట్‌ చెప్పాడు. మట్టి పిసుక్కొనే వారని మన దేశంలో చిన్న చూపు చూస్తున్నట్లే ఫ్రాన్స్‌లో కూడా రైతులంటే చిన్న చూపు ఉంది. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ ఇంథనంపై పన్నులు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫ్రెంచి నూతన ప్రధాని గాబ్రియెల్‌ అటాల్‌ జనవరి 26న ప్రకటించినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఉక్రెయిన్‌ నుంచి చౌకధరలకు వస్తున్న ధాన్యం, పంచదార, కోడి మాంసం, గుడ్లు కారణంగా తమ దేశాల్లో సమస్యలు తలెత్తిన కారణంగా వాటి మీద ఆంక్షలు విధిస్తామని తూర్పు ఐరోపా దేశాలను గతంలో ఫ్రాన్సు తప్పుపట్టింది. ఇప్పుడు అదే పాలకులు రైతుల ఆందోళన కారణంగా తమ వైఖరిని మార్చుకొని దిగుమతులను అడ్డుకోవాలని చెబుతున్నారు. బెల్జియంలో కూడా రైతులు నిరసన తెలిపారు. రాజధాని బ్రసెల్స్‌లో స్పెయిన్‌ నుంచి వస్తున్న ఐదు లారీల కూరగాయలను ధ్వంసం చేశారు. పారిస్‌కు దారితీసే రోడ్లను దిగ్బంధం చేయటం అంటే గీత దాటటమేనని, గ్రామీణ జీవనాన్ని నాశనం చేస్తున్నారని ప్రభుత్వం జనవరి 29న హెచ్చరించింది. రైతులు రాజధానిని దిగ్బంధం చేయనున్నారనే వార్తలతో అధ్యక్షుడు మాక్రాన్‌ పారిస్‌ ముట్టడి అనే అంశం గురించి మంత్రులతో అత్యవసర సమావేశం జరిపాడు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు మొత్తం ప్రభుత్వం, అధ్యక్షుడు కూడా సిద్ధపడినట్లు ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. నగరంలోకి ట్రాక్టర్లను అడ్డుకొనేందుకు పదిహేను వేల మంది పోలీసు, ఇతర సిబ్బందిని సిద్ధం చేశారు. విమానాశ్రయాలు, ప్రధాన ఆహార మార్కెట్లకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతుల దిగ్బంధన ఆందోళన కారణంగా తాము దక్షిణ ఫ్రాన్సులో ప్రవేశించలేక పోతున్నామని బ్రిటన్‌ పౌరులు కొందరు చెప్పారు. తమ ఆందోళన పౌరులకు ఇబ్బంది కలిగించటానికి కాదని, సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియచేయటానికేనని రైతులు చెప్పారు.

అనేక దేశాల్లో ప్రభుత్వాలు విఫలమైన కారణంగా మితవాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. జూన్‌లో జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ కారణంగానే అన్ని తరగతుల వారూ సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌, ఫ్రాన్స్‌, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, స్లోవేకియాలలో మితవాద శక్తులది పైచేయి కావచ్చని, మరో తొమ్మిది దేశాలలో రెండవ, మూడవ స్థానాలలో ఉండవచ్చునని తేలింది. ఈ శక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రవేశించాయి. రుమేనియాలో 2019లో కేవలం 1.75 వేలుగా ఉన్న టిక్‌టాక్‌ వినియోగదారులు 2023నాటికి 78.5 లక్షలకు పెరిగారు. ఫ్రాన్సులో 2.14 కోట్లు, జర్మనీలో 2.09 కోట్లు, ఇటలీలో 1.97 కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగదారులు ఉన్నారు. రుమేనియాలో చౌక ధరలకు లభిస్తున్న ఇంటర్నెట్‌ కారణంగా రైతుల ఉద్యమానికి ఎంతో ప్రచారం లభించిందని, మితవాద శక్తులు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని కొంత మంది ఆరో పించారు. అసలు సమస్యలు ప్రస్తావించకుండా ఎవరెన్ని ప్రచారాలు చేసినా జనం స్పందించరన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.

– సత్య

➡️