చైతన్యంతోనే  బాల్యవివాహాల నిర్మూలన : ఎస్పీ వకుల్ జిందాల్

Nov 18,2023 13:03 #Bapatla District, #police
ప్రజాశక్తి – బాపట్ల : బాల్యవివాహాలు సామాజిక సమస్యని, సమాజ చైతన్యంతోనే నిర్మూలించ వచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రచురించిన బాల్యంలో పెళ్లిళ్లు – భావితరాలకు ఉరితాళ్లు అనే కరపత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహలు సమాజంలోని దురాచారానికి ప్రతిరూపమని అన్నారు. బాల బాలికలను చదువు, ఆటపాటలకు దూరం చేసి కష్టాలలోకి నెడుతుందని అన్నారు. పసి వయస్సు పిల్లల భవిష్యత్తును దూరం చేస్తుందని అన్నారు.  బాల్య వివాహాలు చేసుకున్న వారు సామాజికంగా, ఆరోగ్యం పరంగా, కుటుంబ పరమైన సమస్యలను ఎదుర్కొంటారని అన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు బలమైన చట్టాలు ఉన్నాయని అన్నారు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా ఉంటుందని అన్నారు. నిందితులకు బెయిల్ కూడా ఉండదని తెలిపారు. బాల్య వివాహాలు జరిపిన పక్షంలో ఇరుపక్షాల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, పెళ్లి చేసిన పురోహితులు, పెళ్లిలో పాల్గొన్న పెద్దలు సైతం శిక్షకు అర్హులవుతారని అన్నారు. మీ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతూ ఉంటే సమీపంలోని పోలీస్ స్టేషన్, అంగన్వాడీ కేంద్రం, స్కూల్ టీచర్, సచివాలయ సిబ్బందికి తెలపాలని అన్నారు. 100, 1098 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఇలాంటి మంచి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న డిబిఆర్‌సి బృందాన్ని అభినందించారు. డిబిఆర్సి ఏరియా కో-ఆర్డినేటర్ వి భగవాన్ దాస్ మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దళితులు, గిరిజనులు, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు సమాజం పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహాలు అధికంగా ఉన్నాయని, అవగాహన కల్పించేందుకు బాపట్ల, చీరాల, వేటపాలెం మండలాల్లో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుదే రాజారావు, శాంతి రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ నిర్వాహకులు కనపర్తి రాజారావు పాల్గొన్నారు.
➡️