పర్యావరణ పరిరక్షణ..

వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని రాజ్యాంగంలో ప్రత్యేక ప్రాధమిక హక్కుగా, మానవ హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించడం ముదావహం. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, శక్తులు, సంస్థలకు ఈ తీర్పు ఎంతో ఊతం అందిస్తుంది. పర్యావరణవేత్తలకు సుప్రీం తీర్పు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసం, నష్టం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద కాలుష్య దేశంగా మనదేశం ఉంది. ప్రతి భారతీయుడి జీవిత కాలంలో 5.3 సంవత్సరాలు తగ్గిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిం దంటే మనందరిపై ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ల దురాశ, పర్యావరణ అంశాలను ఏమాత్రం పట్టించుకోని కేంద్రప్రభుత్వ తీరు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
గుజరాత్‌, రాజస్థాన్‌లో ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ, అంతరించిపోతున్న వాటిలో తీవ్రత అధికంగా ఉన్న బట్టమేక పక్షి (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ – జిఎస్‌టి), లెస్సర్‌ ఫ్లోరికాన్‌ జాతుల ఆవాసాల్లో విమాన మార్గాలు, విద్యుత్‌ పంపిణీ లైన్లు ఏర్పాటు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. వాతావరణ మార్పులు, కాలుష్యం తదితర కారణాలతోపాటు అవి ఎగిరే మార్గాల్లో ఉన్న అధిక ఓల్టేజితో కూడిన ఓవర్‌హెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు వాటి క్షీణతకు ప్రదాన కారణం.
సమానత్వ హక్కును కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణ, జీవించే హక్కును కల్పించే 21వ అధికరణ ఎంతో ప్రాధాన్యత కలిగినవి. స్వచ్ఛమైన పర్యావరణం లేకపోతే ఈ రెండు హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత వల్ల ఆహార కొరత, తాగునీటి వనరులకు ప్రమాదం ఏర్పడితే తొలి ముప్పును ఎదుర్కొనేది నిరుపేదలే. ఈ విధంగా వాతావరణ మార్పులకు, మానవ హక్కులకు మధ్య ఎంతో సంబంధం ఉంది. పర్యావరణం, ఆరోగ్యానికి సంబంధించిన హక్కులు హరించుకుపోతే జీవన హక్కు, వ్యక్తిగత సమగ్రత, ఆరోగ్యం, నీరు, గృహ నిర్మాణం, సమాచార హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, ప్రాతినిధ్య హక్కు… ఇలా ఎన్నో హక్కులకు చెల్లుచీటీనే.
వాతావరణ మార్పులు మనదేశంసహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తుపానులు, వరదలు వంటి విపత్తుల్లో చిక్కుకుంటున్నాయి. భూతాపాన్ని నియంత్రించడం ద్వారానే ఈ తరహా ప్రమాదాలను రూపుమాపగలమని నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ల అత్యాస, లాభాల కోసం పోటీ దీనికి ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఒక అధ్యయనం ప్రకారం గత ఏడాది వాతావరణ విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది మరణించారు. అమెరికాకు చెందిన జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
పారిశ్రామిక విప్లవపు పూర్వ సగటు కంటే భూమి దాదాపు 1.2 డిగ్రీల సెల్సియస్‌ వేడెక్కింది. భూ ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే స్వల్ప మార్పు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ధనిక దేశాలు, ఆ దేశాల్లోని కార్పొరేట్లు వీటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వాతావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. పారిస్‌ వాతావరణ సదస్సు నిర్దేశించిన రెండు డిగ్రీల సెల్సియస్‌కు భూతాపాన్ని పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని అందుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా లాంటి ధనిక దేశాలే అందుకు మోకాలడ్డుతున్నాయి. 1.2 డిగ్రీల సెల్సియస్‌కే ప్రకృతి ఆగ్రహం కారణంగా చోటుచేసుకున్న పరిణామాలను చూస్తున్నాం. ఇది మరింత పెరిగితే జరిగే విపరిణామాలను తట్టుకోవడం అసాధ్యం. అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే లాభార్జనకన్నా, విశ్వ మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడమే మార్గం. సుప్రీం నిర్దేశించినట్లు వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలపై పోరాటం ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కు, మానవ హక్కు. వాటిని కాపాడుకునే ఉద్యమంలో అందరూ భాగస్వాములవ్వాలి.

➡️