వచ్చీ రాని ఇంగ్లీషే ప్రత్యేక గుర్తింపు తెచ్చింది !

Dec 20,2023 10:45 #Jeevana Stories

           చాలామంది నటులు ఉంటారు. అనేక రకాలుగా నటించి ప్రేక్షకుల మన్ననలను అదుకుంటారు. కానీ, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ నటుడిని చూడగానే అదే గుర్తొస్తుంది. ఆ నటుడు తప్ప అలా ఇంకెవరకూ చేయలేరు అనిపిస్తుంది. రంగస్థలం మీద రాణించి, బుల్లితెర మీద తెగ నవ్వించి, వెండితెర మీద తళుక్కుమని మెరుస్తున్న క్యారక్టరు ఆర్టిస్టు రాపేటి అప్పారావుకు వచ్చీరాని ఇంగ్లీషుతో జరిపే సంభాషణే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఆయన ఇంగ్లీషు వాక్యాలు వింటుంటే ప్రేక్షకులు పడి పడీ నవ్వుతారు. అలాంటి పాత్రలో ఆయన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గోనేందుకు విజయవాడ వచ్చిన అప్పారావు ‘జీవన’తో మాట్లాడారు. తన కళారంగ ప్రస్థానం గురించి వివరించారు.

ఆఫీసు బాయ్ గా ఉద్యోగారంభం

అప్పారావు 1967 మార్చి 1న విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం గుండుపాలెం దగ్గరలోని చౌడువాడలో జన్మించారు. వారి కుటుంబం 1971లో విశాఖనగరంలోని అక్కయ్యపాలెంలో స్థిరపడింది. కాస్త వయసు వచ్చాక ఓ ప్రయివేటు కంపెనీలో ఆఫీసు బారుగా చేరి, ఆ తర్వాత ఆటోమొబైల్‌ కంపెనీలో చేరారు. అలా 20 ఏళ్ల ఉద్యోగ ప్రయాణంలో బారు నుంచి సీనియర్‌ క్లర్కు వరకూ ఎదిగారు. ఈ క్రమంలోనే తమ కంపెనీకి వచ్చే లెటర్లను డిస్‌ప్యాచ్‌ విభాగానికి తీసుకెళుతూ, ఆ లెటర్లను చదువుతూ ఇంగ్లీషు పదాలు ఒంట పట్టించుకున్నారు. అలా బట్టీ పట్టిన ఇంగ్లీషు పదాలే నేడు ఆయన హాస్యంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ”నేను పలికే ఇంగ్లీషు పదాలు, వాక్యాలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ విధంగా ప్రేక్షకులు నిండుగా నవ్వుకోవడం నాకూ ఆనందాన్నిస్తోంది…” అని ఆయన అంటున్నారు.

రంగస్థలంపై రాణింపు

తమ నివాసానికి దగ్గరలో ఉన్న మాదేటి గార్డెన్స్‌లోని గౌరీ సేవాసంఘం గ్రంథాలయానికి అప్పారావు రోజూ వెళుతూ ఉండేవారు. సాయంత్రం పూట అక్కడ కొంతమంది కళాకారులు నాటకాల కోసం రిహార్సల్స్‌ చేసేవారు. నటన అంటే ఉన్న ఆసక్తితో అప్పారావు వారిని గమనిస్తూ, అనుకరిస్తూ, ఆ కళాకారులతో పరిచయం పెంచుకున్నారు. అలా 1984లో మాదేటి లక్ష్మణరావు ప్రమేయంతో ‘మంచం మీద మనిషి’ అనే నాటకంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు మేడే ఉత్సవాల్లో ‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో శతృఘ్నుని పాత్ర పోషించి మెప్పించారు. తర్వాత అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. బుర్రకథ పితామహులు షేక్‌ నాజర్‌ శిష్యబృందంలో ప్రముఖులు కొమరశ్రీ దగ్గర బుర్రకథాగానంలోని మెళకువలను నేర్చుకున్నారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ళ వేణుమాధవ్‌ని అనుకరిస్తూ మిమిక్రీ, స్కిట్లు చేసేవారు. అప్పటి రంగస్థల నటులు షణ్ముఖ ఆంజనేయరాజు, సంపత్‌ లక్ష్మణరావు, ఎ.వి.సుబ్బారావు, పీసపాటి నరసింహమూర్తి వంటి ప్రముఖుల ప్రభావం ఆయన మీద ఎంతో ఉంది. 1994-95లో ఆంధ్రా యూనివర్శిటీలో రంగస్థల విభాగపు కోర్సును పూర్తి చేసి డిప్లమో పొందారు.

సత్యానందం మాస్టారి శిష్యుడిగా …

ఎందరో యువ అగ్రనటులను నటనలో మెళకువలను నేర్పి తీర్చిదిద్దిన లంకా సత్యానందం మాస్టారు దగ్గర అప్పారావు నటనలో శిక్షణ పొందారు. అత్తిలి కృష్ణారావు, రామవరపు శరత్‌బాబు, అబ్బూరి గోపాలకృష్ణ, ఆర్‌.వి.బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖుల పరిచయం అప్పారావును నాటక రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లింది. నాటి నాటక రంగ ప్రముఖులు ఎ.వెంకటేశ్వరరావు, కలియుగ అర్జునుడుగా పేరు గాంచిన అచ్చంనాయుడు తదితర ప్రముఖులతో కలిసి నటించారు.

శుభవేళతో సినీరంగ ప్రవేశం

2000లో బి.వి.రమణ దర్శకత్వంలో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘శుభవేళ’ సినిమాలో ఆయన సినీ నట జీవితం మొదలైంది. పటాస్‌, సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్‌, భీమ్లా నాయక్‌ వంటి 250కు పైగా సినిమాల్లో నటించారు. సరిలేరు నీ కెవ్వరులో ఆయన పోషించిన టిక్కెట్‌ కలెక్టర్‌ (టిసి) పాత్ర తరువాత మరో 80 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2014లో దర్శకుడు బి.చిన్నికృష్ణ ద్వారా జబర్దస్త్‌లో అప్పటికే పేరున్న షకలక శంకర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ షోలో నటించి, బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. షకలక శంకర్‌, రచ్చ రవి, చలాకీ చంటి, రాకెట్‌ రాఘవ, రామప్రసాద్‌, బుల్లెట్‌ భాస్కర్‌, సరదా సత్తిపండు, ప్రకాష్‌ తదిరుల టీముల్లో పనిచేసి, ‘ఆసమ్‌ అప్పి’గా పేరొందారు.                                 అప్పారావు బుల్లితెర ప్రవేశం 2007లో ఓ కామెడీ షోతో జరిగింది. ఈటీవి కామెడీ గ్యాంగ్‌లో కొండవలస లక్ష్మణరావు, తెలంగాణా శకుంతల, జయలలిత, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్‌, మచ్చా జ్యోతి, కరాటే కళ్యాణి తదితరులతో కలిసి భాగస్వామ్యం వహించారు. తరువాత వివిధ ఛానెళ్ల షోలలో ఇచ్చిన ప్రదర్శనలతో హాస్యపు జల్లులు కురిపించారు.

ఆయన నటనకు గానూ అనేక సంస్థలు పురస్కారాలతో సత్కరించాయి. ఇంటర్నేషనల్‌ ఎచీవర్స్‌ కౌన్సిల్‌, ఏషియా వేదిక్‌ కల్చర్‌ ఫౌండేషన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తమిళనాడులోని హోసూరులో 2022లో ఐకాన్‌ అవార్డు అందించింది. రంగస్థలంపై ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అవార్డులు అందుకున్నారు.

– సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు

ప్రేక్షకులను అలరించటమే లక్ష్యం

జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాను. కానీ, వీటివల్ల కనీసం 200 సినిమా అవకాశాలు కోల్పోయాను కూడా. మార్కెట్లో మంచి గుర్తింపుతో మరిన్ని అవకాశాలొస్తున్నాయి. నా ఇంగ్లీషు డైలాగులు బాగా పాపులర్‌ అయ్యాయి. కమెడియన్‌, లెక్చరర్‌, ప్రిన్సిపల్‌, సాఫ్ట్‌వేర్‌ ఎండి, టిక్కెట్‌ కలెక్టర్‌గా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించాను. హోసూరులోని ఓ సంస్థ నాకు డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఓపిక ఉన్నంతకాలం ఇలా బుల్లితెర, వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరించాలనేది నా ఆకాంక్ష.

– రాపేటి అప్పారావు, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, విశాఖపట్నం

➡️