నాల్గోటెస్ట్‌కు రాంచీ సిద్ధంజట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌

Feb 22,2024 22:15 #Sports

రాబిన్సన్‌, బషీర్‌లకు చోటు

ఉదయం 9.30గం||ల నుంచి

రాంచీ: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య నాల్గో టెస్ట్‌ రాంచీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన తొలి మూడు టెస్టులు ఫలితం వచ్చాయి. హైదరాబాద్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. విశాఖ, రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండు, మూడు టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యతలో ఉండగా.. నాల్గో టెస్ట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టెస్ట్‌లోనూ గెలిచి మరో టెస్ట్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. సిరీస్‌ చేజార్చుకోకుండా ఉండాలంటే ఇంగ్లండ్‌కు గెలుపు తప్పనిసరి. నాల్గో టెస్ట్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌ జట్టు తుదిజట్టును ప్రకటించింది. రెహాన్‌ అహ్మద్‌, మార్క్‌ వుడ్‌ స్థానంలో ఓలీ రాబిన్సన్‌, షోయబ్‌ బషీర్‌ చోటు దక్కించుకున్నారు. గత ఏడాది యాషెస్‌ సిరీస్‌ తర్వాత రాబిన్సన్‌ టెస్టుల్లో చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం. పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బెంచ్‌కే పరిమితయ్యే సూచనలు కనబడుతున్నాయి. అతడు రాజ్‌కోట్‌ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసి నిరాశపరిచాడు. టీమిండియా విషయానికొస్తే.. యువ క్రికెటర్లతో భారత్‌ దుర్భేద్యఫామ్‌లో ఉంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రెండు ద్వి శతకాలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ రాజ్‌కోట్‌ టెస్ట్‌లో రాణించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశపరుస్తున్నా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ మూడో టెస్ట్‌లో రెండు అర్ధసెంచరీలతో మెరిసాడు.

జట్లు(అంచనా)… భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, పటీధర్‌, సర్ఫరాజ్‌, జడేజా, ధృవ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, కుల్దీప్‌, ముఖేష్‌, సిరాజ్‌/ఆకాశ్‌ దీప్‌.

ఇంగ్లండ్‌: క్రాలే, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), ఫోక్స్‌(వికెట్‌ కీపర్‌), డకెట్‌, పోప్‌, బెయిర్‌స్టో, రూట్‌, రాబిన్సన్‌, బషీర్‌, హార్ట్‌లీ, ఆండర్సన్‌.

➡️