ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలి : వ్యకాస

Mar 2,2024 15:22 #Dharna, #Kurnool, #upadhi
  • 5న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : వలసలు అరికట్టి, ఉపాధి హామీ 200 రోజులకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ.. 5న ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న, మండల కార్యదర్శి డి. రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్‌ వలసలకు పెట్టింది పేరున్నారు. డివిజన్‌ పరిధిలో సుమారు లక్ష మందికి పైగా కూలీలు తెలంగాణ, గుంటూరు, బెంగళూరు,హైదరాబాద్‌ ప్రాంతాలకు పని కోసం వలస బాట పట్టారన్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాలకు వచ్చి వారికి ఉపాధి చూపిస్తామని మాటలు చెప్పి, పనులు చేసి మూడు నెలలు దాటుతున్న వేతనాలు చెల్లించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరువు పరిస్థితులు వలన అదనంగా రావలసిన పది పని దినాలు 50 రోజులు నేటికీ రాలేదని, వేతనం కూడా చాలా అన్యాయంగా ఉందని కనీస వేతనం 400 నుండి 500 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు ఏ పని లేక ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఉందని,అదనంగా వంద రోజులు పెంచాలని డిమాండ్‌ చేశారు. పనుల గుర్తింపు విషయంలో కూడా కేవలం దగవుట్‌ పనులు మాత్రమే చూపుతున్నారని మిగతా ఫీడర్‌ ఛానల్‌ పూడికతీత పనులు మంజూరు చేయడం లేదని ఇది ఉపాధి కూలీలకు అన్యాయం చేయడం అవుతుందని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో ఆదోని పశ్చిమ ప్రాంతంలో కూలీలకు జరుగుతున్న అన్యాయంపై మార్చ్‌ 5వ తేదీన ఉదయం 10 గంటలకు ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని,ఈ ధర్నాకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ హాజరవుతారని పై సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి కూలీలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

➡️