కృష్ణాజలాల వివాదంపై 6న కీలక సమావేశం

  • జలశక్తి శాఖ నిర్ణయం
  • ఇప్పటికే కేంద్ర బలగాల ఆధీనంలోకి సాగర్‌

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణాజలాల వివాదంపై చర్చించేందుకు ఆరవ తేది (బుధవారం) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఇప్పటికే కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం రాత్రికే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సిఆర్‌పిఎఫ్‌ దళాలు, శనివారం డ్యామ్‌ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆరవ తేది నిర్వహించనున్న సమావేశంలో కృష్ణా జలాల వివాదం, సాగర్‌, శ్రీశైలం డ్యామ్‌ల నిర్వహణ కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డుకు అప్పగించడం తదితరఅ ంశాలపై చర్చించనున్నారు. శనివారం నాడు కూడా ఇవే అంశాలపై రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినహా ఇరు రాష్మ్రాటలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్నికలు జరగడం, కౌంటింగ్‌ ఏర్పాట్లలో అధికారయంత్రాంగం నిమగం కావడం తదితర కారణాల రీత్యా ఐదవ తేది సమావేశాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. దీంతో ఆరవతేది సమావేశాన్ని నిర్వహిస్తామని జలవనరుల శాఖ కార్యదర్శి ముఖర్జీ అన్నారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఎపి ఇచ్చిన ఇండెంటుపై సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కెఆర్‌ఎంబి చైర్మన్‌ శివనందన్‌ కు ఆయన సూచించారు విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌. జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని అన్నారు. తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.

➡️