శరవేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు

Dec 7,2023 08:03 #Cyclone, #Michaung Cyclone
electricity connections repair

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌
37కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు. తుపాన్‌ ప్రాంతాల్లోని విద్యుత్‌ పునరుద్ధరణ పనులు, సరఫరాపై ట్రాన్స్‌కో, డిస్కంల అధికారులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావడంలో విద్యుత్‌ సంస్థలు విజయవంతమయ్యాయన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తిచేసి వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సరఫరా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు నిరంతరం పనిచేస్తున్న విద్యుత్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. చెందోడులోని 132కెవి సబ్‌స్టేషన్‌ మరమ్మత్తులు పూర్తిచేసి విద్యుత్‌ పునరుద్ధరణ చేశామని ట్రాన్స్‌కో అధికారులు విజయానంద్‌కు వివరించారు. మొత్తం 17 ఫీడర్లు దెబ్బతిన్నాయని, వీటిల్లో 10 ఫీడర్లను పునరుద్ధరణ చేశామని తెలిపారు. తుపాన్‌ వల్ల విద్యుత్‌ సంస్థలకు రూ.37కోట్ల నష్టం జరిగిందని మూడు డిస్కంల సిఎండిలు అంచనా వేశారు. ఎపిసిపిడిసిఎల్‌ సిఎండి కె సంతోషరావు మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలో 1132 గ్రామాలు, 46 మండలాలు, 7 పట్టణాల్లో మరమ్మత్తుల పనులు పూర్తయ్యాయని చెప్పారు. మొత్తం 231 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రూ.1235.45లక్షల నష్టం జరిగిందని తెలిపారు. నెల్లూరులో 33/11 కెవి సబ్‌స్టేషన్లు 36 పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. ఇపిడిసిఎల్‌ సిఎండి ఐ పృథ్వీతేజ్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల పరిధిలో 1110 గ్రామాలు, 77 మండలాల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం 395 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రూ.545.98లక్షల నష్టం తుపాన్‌ వల్ల జరిగిందని వివరించారు. ఎపిసిపిడిసిఎల్‌ సిఎండి పద్మజనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు పరిధిలో 1707 గ్రామాలు, 109 మండలాలు, 11 పట్టణాల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 81 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రూ.1995.57లక్షల నష్టం జరిగిందని వివరించారు.

➡️