Corruption: ఇవే బిజెపి అవినీతి వ్యూహాలు…

వివరించిన కాంగ్రెస్
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ డేటా బిజెపి “అవినీతి వ్యూహాలను” బహిర్గతం చేసిందని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసే కంపెనీల రక్షణ కోసం, కిక్‌బ్యాక్‌లు చేయడం వంటి క్విడ్ ప్రోకో విధానాలను బిజెపి అమలు చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ యూనిక్ బాండ్ ఐడి నంబర్‌లను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ విడుదలపై జరిగిన జాప్యంపై విచారణ చేపట్టాలని ఎక్స్ ద్వారా పోస్టు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ పొందడంలో బిజెపి నాలుగు అవినీతి వ్యూహాలను అమలు చేసిందని రమేష్ పేర్కొన్నారు. అందులో ఒకటి క్విడ్ ప్రోకో. ఎలక్టోరల్ బాండ్‌లను విరాళంగా ఇచ్చిన కంపెనీలు, ఆ తర్వాత ప్రభుత్వం నుండి భారీ ప్రయోజనాలను పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రా రూ. 800 కోట్లకు పైగా ఎన్నికల బాండ్లు ఇచ్చింది. ఏప్రిల్ 2023లో వారు రూ. 140 విరాళంగా ఇచ్చారు. నెల రోజుల తరువాత వారికి రూ. 14,400 కోట్ల థానే-బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్‌ను బిజెపి ప్రభుత్వం అప్పగించిందని ఆయన ఆరోపించారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ (7 అక్టోబర్ 2022న) రూ.25 కోట్ల బాండ్లను అందించగా, కేవలం మూడు రోజుల తర్వాత (10 అక్టోబర్ 2022న) గారే పాల్మా బొగ్గు గనిని పొందారని రమేష్ పేర్కొన్నారు.
హఫ్తా వసూలీ అనేది బిజెపి మరో అవినీతి వ్యూహమని తెలిపారు. కంపెనీలపై ఈడీ/సిబిఐ/ఐటి దాడుల చేసి, వాటి నుండి కంపెనీల రక్షణ కోసం విరాళాలు కోరడమే హఫ్తా వసూలీ అని పేర్కొన్నారు. ఇలా మొదటి 30 మంది దాతలలో కనీసం 14 మంది దాడి చేయబడ్డారని రమేష్ ఆరోపించారు.
ఫ్యూచర్ గేమింగ్ & హోటల్స్ రూ. 1200 కోట్లకు పైగా విరాళం అందించిందని, ఇది ఇప్పటివరకు ఉన్న డేటాలో అతిపెద్ద దాతగా నిలిచిందన్నారు. 2022, ఏప్రిల్ 2న ఈడీ దాడులు చేస్తే, 5 రోజుల తరువాత(ఏప్రిల్ 7న) రూ. 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా బిజెపికి ఇచ్చారని రమేష్ పేర్కొన్నారు.
2023 డిసెంబర్‌లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటీ శాఖ దాడులు చేసి, 2024 జనవరిలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.40 కోట్లు విరాళంగా ఇచ్చిందని రమేష్ పేర్కొన్నారు.
హెటెరో ఫార్మా, యశోద హాస్పిటల్ వంటి అనేక కంపెనీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చాయని కాంగ్రెస్ నేత రమేష్ పేర్కొన్నారు.

➡️