Election Commission: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ 16 ఫిర్యాదులు

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ విద్వేషపు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌(ఇసి)కి ఫిర్యాదు చేసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ మను సింఘ్వీ, గురుదీప్‌ సప్పల్‌, సుప్రియాశ్రీనతేలతో కూడిన ప్రతినిధుల బృందం సోమవారం ఇసిని కలిసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన వేర్వేరు తీర్పులు, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ప్రజాప్రాతినిథ్య చట్టం 1951ని బిజెపి, ఇతర నేతలు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.

చట్టబద్ధమైన ఈ ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ తగిన చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నట్లు జైరాం రమేష్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా అడ్డుకునేందుకు ప్రధాని మోడీ మతాన్ని వినియోగించారని, కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతలపై తప్పుడు, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఓ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దూరదర్శన్‌ లోగోను కాషాయీకరించడంపై కూడా కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. మరో ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొంది.

ఆదివారం రాజస్థాన్‌లోని బన్స్వారాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై అవాకులు, చవాకులు పేలారు. దేశంలో వ్యక్తిగత సంపదనంతా ముస్లింలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ యత్నిస్తోందని, దేశంలోని వనరులపై ముస్లింలకే తొలిహక్కు ఇప్పటికే ప్రకటించిందని ఆరోపించారు.

ప్రధాని మోడీ విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ (ఇసి) వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.

➡️