ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేయాలి : సిఇఒ ముఖేష్‌ కుమార్‌ మీనా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు పరిచేందుకు తీసుకుంటున్న చర్యలను ఆదివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు విస్తృతంగా పర్యటిస్తూ, ఈ నియమ, నిబంధనలను పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల అధికారులు ఎన్నికల నిర్వహణ ప్రణాళికలను ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి పంపించాలన్నారు. సి-విజిల్‌ యాప్‌లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదేరోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైకోర్టులో దాఖలైన కేసులపై సమీక్షిస్తూ, కేసులకు సంబంధించిన వాస్తవ నివేదికను ఎలక్షన్‌ కమిషన్‌కు అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెక్టోరల్‌ అధికారులకు మెజిస్టీరియల్‌ అధికారులు ఇచ్చే ప్రతిపాదనలను వెంటనే హోంశాఖకు పంపించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు సిఇఒలు పి కోటేశ్వరరావు, ఎమ్‌ఎన్‌ హరెంధిర ప్రసాద్‌, జాయింట్‌ సిఇఒ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఒ, కె విశ్వేశ్వరరావు, ఎస్‌ మల్లిబాబు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

➡️