రుతుక్రమంపై కోవిడ్‌ ప్రభావం

Mar 6,2024 09:09 #feature

కోవిడ్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. గుణపాఠాలూ చెప్పింది. రుతుక్రమం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఎన్నో అధ్యయనాలు వెలుగుచూశాయి. తాజాగా మరో పరిశోధన కూడా ఆ విషయాన్ని మరోసారి రుజువుచేసింది. జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌, ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కరణ్‌ బాబర్‌ లింగ ఆధారిత విద్య, ఆరోగ్యంపై చేసిన తాజా పరిశోధనలో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి.

కోవిడ్‌ సమయంలో అత్యంత ప్రభావవంత ప్రాంతాలు, స్వల్ప ప్రభావంత ప్రాంతాలుగా విభజించి లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసరాల సరఫరాపై ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థలు శక్తివంచన లేకుండా కృషి చేసినా సామాన్యులు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నిత్యవసరాల జాబితాలో లభించని శానిటర్ల ప్యాడ్ల కొరత వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. ఇదే ఇప్పుడు పెను ప్రమాదానికి దారి తీసింది. తాజా సర్వేలో కోవిడ్‌ సమయంలో లోపించిన రుతుక్రమ ఆరోగ్య ప్రభావం ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని తేలింది.కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న ప్రాంతాల్లో, స్వల్ప నిబంధనలు ఉన్న ప్రాంతాలతో పోల్చిచూసినప్పుడు రుతుక్రమంలో ఉన్న బాలికల్లో కఠిన నిబంధనలు ఉన్న చోట 53 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందలేదు. దీంతో 2020 కోవిడ్‌ సమయంలో ఆ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్ల వినియోగం 16 శాతానికి పడిపోయింది. గ్రామీణ జిల్లాల్లో ఈ నిష్పత్తి మరింత దిగజారి 25 శాతానికి చేరుకుంది. ‘లాక్‌డౌన్‌ సమయంలో శానిటరీ ప్యాడ్ల లభ్యత చాలా కష్టమైంది. మార్కెట్లోని దుకాణాలు మూసివేయబడ్డాయి. దీంతో మాకు వేరే మార్గం కనిపించలేదు’ అని నాటి పరిస్థితిని గుర్తుచేసుకుంది తూర్పు బీహార్‌ ప్రాంత హార్దియా గ్రామ నివాసి 19 ఏళ్ల యువతి. ఈ అనుభవం ఆమెది మాత్రమే కాదు.. ఎంతోమంది ఆ సమయంలో ఇబ్బందులు పడ్డారు. ‘మా గ్రామంలో శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయాలని నేను, నా స్నేహితులు ఎంతో ప్రయత్నించాం. కానీ అవి సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ ధరకు విక్రయించారు’ అని ఆమె చెబుతోంది. ‘డిస్బోజబుల్‌ ప్యాడ్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మారు. నేను రెట్టింపు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వచ్చింది’ అని తన అనుభవాన్ని చెప్పింది 27 ఏళ్ల మరో యువతి.

మన దేశంలో అనాదిగా రుతుక్రమం చుట్టూ ఎన్నో అపోహలు ఉన్నాయి. రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్యంపై చాలా మందికి అవగాహన లేదు. రుతుక్రమంలో ఉండడం పవిత్రకు భంగం కలిగించడమన్న ధోరణి సమాజంలో పాతుకుపోయింది. ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని దేశంలో 2011 నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేశారు. అయితే కోవిడ్‌ సమయంలో మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చాయి. ముఖ్యంగా రుతుక్రమ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. మార్కెట్లో ఉత్పత్తులు లభించక, పాత పద్ధతులనే చాలామంది అనుసరించారు. ఈ ప్రభావం వారి జననేంద్రీయ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్‌డౌన్‌ తరువాత ఈ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య పెరిగిందని పరిశోధనలో తేలింది. కోవిడ్‌ సమయంలో వనరులన్నీ వైరస్‌ వ్యాప్తి నిరోధ అంశాల వైపే మళ్లించారు. శానిటరీ ప్యాడ్లను పూర్తిగా విస్మరించారు. ఆ ప్రభావం నేటికీ కొనసాగుతోందని పరిశోధన స్పష్టం చేసింది. ఒత్తిడి, దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్న ఎందరో కోవిడ్‌ సమయంలో రుతుక్రమంలో సరైన వసతులు లభించకపోవడం వల్లనే అని ప్రొఫెసర్‌ చెబుతున్నారు.

➡️