కార్పొరేట్ల చేతుల్లో విద్య

Jan 13,2024 10:56 #corporates, #Education, #hands
  • సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ
  • ఎస్‌టియు వజ్రోత్సవ వేడుకలు ప్రారంభం

ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ : ప్రస్తుతం విద్య కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిందని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ అన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రాథమిక విద్యకు ఇటీవల కాలంలో నిధుల కోత పెడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి విద్య అందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ యూనియన్‌ (ఎస్‌టియు) వజ్రోత్సవ వేడుకలు శనివారం కర్నూలులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ మైదానంలో జరిగిన వేడుకలకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎన్‌వి.రమణ, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ సమితి నాయకులు చాడ వెంకటరెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్‌ నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌వి.రమణ మాట్లాడుతూ.. దేశంలో1.20 లక్షల ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయని, దాదాపుగా 11 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఐదో తరగతి చదివే పిల్లలకు రెండు అంకెల లెక్కలు కూడా చేయడం రావడం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో నడుస్తున్న విద్యా బోధన సమాజాన్నికి అభివృద్ధి చెందేలా లేదన్నారు. కేవలం యాంత్రిక బోధన మాత్రమే కొనసాగుతుందని విమర్శించారు. ఇటీవల కాలంలో విద్యాబోధన ఇంగ్లీష్‌ మీడియం పేరుతో కొనసాగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ వారి మాతృభాషలోనే సాంకేతిక విద్య కొనసాగుతోందని తెలిపారు. మనదేశంలో మాతృభాషలోనే విద్యా బోధన అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలని, వేమన, సుమతి శతకంలోని పద్యాలను విద్యార్థులతో చదివించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. మూఢనమ్మకాలను అనుసరించే విద్య ఉండకూడన్నారు. గతంలో వామపక్ష ఐక్య ఉద్యమాల ద్వారానే అనేక సమస్యలకు పరిష్కారం లభించేదని చెప్పారు. ఇటీవల కాలంలో దేశంలో అలాంటి ఒరవడి కొనసాగడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాన సమస్యలపై ఉమ్మడి ఐక్య కార్యాచరణతో ముందుకు సాగితే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. మార్క్స్‌ సిద్ధాంతం ఏదైతే చెప్పిందో అదే ఇప్పుడు జరుగుతుందని, ఈ సిద్ధాంతమే సమాజ మార్పుకు దిక్సూచి అని పేర్కొన్నారు.హిందుత్వ భావజాలం బోధన తగదు: నారాయణప్రస్తుతం దేశంలో హిందుత్వ భావజాల బోధనను పాలకులు అనుసరిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి పటిష్టమైన విద్యాబోధన జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడుకోవాలి : యుటిఎఫ్‌

ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ఉపాధ్యాయ సంఘాలు పోరాడాలని నక్క వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఒపిఎస్‌ అమలు చేసే పార్టీలకు ఉపాధ్యాయులు మద్దతు పలకాలని సూచించారు. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ ఉద్యమాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, కెడిసిసి బ్యాంకు చైర్మన్‌ ఎస్‌వి. విజయ మనోహరి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️