ఆర్థిక చక్రబంధం

Jan 20,2024 07:20 #Editorial

               సహకార ఫెడరలిజం పాటిస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో గొప్పగా చెప్పి అధికారానికొచ్చిన మోడీ సర్కారు ఆచరణలో అందుకు భిన్నంగా రాష్ట్రాల ఆర్థిక వనరులను, అధికారాలనూ క్రమంగా గుంజుకుపోవడం దారుణం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారంటూ అల్‌ జజీరా ప్రచురించిన తాజా కథనం ఈ సర్కారుది ఆదినుండీ అదే తీరని నిర్ధారించింది. ఇందుకోసం ప్రధాని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రహస్యంగా సంప్రదించగా దాని అధిపతి వైవి రెడ్డి వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారని పేర్కొంది. ‘కేంద్ర పన్నుల్లో అధిక వాటా పొందాలన్న ప్రయత్నం బెడిసికొట్టడంతో బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపును కుదించింది’ అని వివరించింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32శాతం నుంచి 42శాతానికి పెంచాలని సూచిస్తూ ఆర్థిక సంఘం 2014 డిసెంబర్‌లో నివేదికను సమర్పించింది. మోడీ ప్రభుత్వం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 33శాతానికి పరిమితం చేయాలని భావించి అందుకోసం ప్రయత్నించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించడం లేదా వాటిని తిరస్కరించి కొత్తగా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనే రెండు ప్రత్యామ్నాయాలే ఉంటాయి. అంతే తప్ప వాటిపై వాదించడం, చర్చించడం లేదా సంప్రదింపులు జరపడం వంటివి చేయరాదు. ప్రధాని మోడీ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ వైవి రెడ్డిని రహస్యంగా సంప్రదించడం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇదీ సహకార ఫెడరలిజం !

రాష్ట్రాలకు రావలసిన పన్నుల వాటాను (షేర్‌) కుదించడానికి సర్వవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వసూలైన పన్నుల్లో చట్టప్రకారం ఇవ్వాల్సిన సొమ్ము (కాంపెన్సేషన్‌) కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సకాలంలో చెల్లించడంలేదు. కోవిడ్‌ సమయంలో సైతం జిఎస్‌టి వాటాను రాష్ట్రాలకు చెల్లించకపోవడం బిజెపి పాలిత రాష్ట్రాలతోసహా అందరూ గొంతెత్తడంతో మొదట అప్పులు చేసుకోవడానికి అనుమతినిస్తామనడం, ఆ తరువాత కొద్ది మొత్తాలను మంజూరు చేసిన అమానుష చరిత్ర ఈ ప్రభుత్వానిది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పన్ను వాటా చెల్లించకపోవడమేగాక విపత్తు సహాయ నిధులను బిగపట్టడంతోపాటు రుణ పరిమితులపై తీవ్ర ఆంక్షలు విధించి చక్రబంధంలో బిగిస్తోంది. ఆర్థిక సంత్సరం చివరి త్రైమాసికంలోనే ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కీలక సమయంలో కేరళను ఆర్థిక దిగ్బంధనానికి కేంద్రం పూనుకోవడం దుర్బుద్ధి మాత్రమే! కేంద్రం నుండి వివిధ రూపాల్లో బకాయిలు రూ. 57 వేల కోట్లు రావలసివుండగా డిసెంబర్‌ చివరి వారంలో కేవలం రూ.1,404 కోట్లు మాత్రమే విడుదల చేయడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. తాను ఇవ్వాల్సిన నిధులివ్వని కేంద్ర ప్రభుత్వం కేరళ సర్కారు అప్పు చెయ్యడానికి కూడా రుణ పరిమితి అనుమతించదని మోకాలడ్డడం దుర్మార్గం. విధానపరంగా బిజెపిని అన్ని రంగాల్లో వ్యతిరేకించడమేగాక ప్రత్యామ్నాయాలను చూపడం మూలంగానే ఎల్‌డిఎఫ్‌ సర్కారుపట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అందుకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోసహా మంత్రివర్గం దేశ రాజధానిలో ఫిబ్రవరి 8న ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆర్థిక దిగ్బంధనాన్ని గురించి ఆ రాష్ట్ర ప్రజలకు వివరించి, అన్ని పార్టీల మద్దతును కూడా కోరారు. ఇది కేవలం కేరళ సమస్య మాత్రమే చూడరాదు. రాష్ట్రాల హక్కుల సమస్యగా, ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతంగా ప్రతి భారతీయుడూ భావించాలి.

భారత రాజ్యాంగ మూలస్తంభాల్లో ఫెడరలిజం ముఖ్యమైనది. ‘ఇండియా అంటే భారత్‌-రాష్ట్రాల సమాహారం’ అని రాజ్యాంగ పీఠిక పేర్కొంది. రాష్ట్రాలతోనే కేంద్రం ఏర్పడింది కనుక రాష్ట్రాలు పరిపుష్టంగా ఉంటేనే బలమైన భారత దేశం సాధ్యం. కానీ బిజెపి సర్కారు రాష్ట్రాలను నామావశిష్టం చేసి అన్ని వనరులను, అధికారాలనూ కేంద్ర ప్రభుత్వం వద్దనే కేంద్రీకరించడం రాజ్యాంగ విరుద్ధం. ‘ఒకే దేశం-ఒకే చట్టం, ఒకే దేశం-ఒకే భాష, ఒకే దేశం-ఒకే ఎన్నికలు…’ ఇలా కేంద్రీకృతం చేసేందుకు పూనుకుంటోంది. ఈ దుర్విధానాలను ఐక్యంగా విశాల ప్రజా ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలి. ఆ సర్కారును గద్దె దించాలి.

➡️