తేలిక ప్రశ్నలు – లోతైన జవాబులు

Dec 6,2023 11:08 #sahityam

మీరేమిటోల్లురా ?

దళితులమయ్యా !

అంటే, ఎందులో వస్తారూ ?

మీ తిట్ల్లల్ల ఒస్తం

మురికి కాలవల్ల ఒస్తం

విడిగా పెట్టిన కంచంల ఒస్తమయ్య

అంటే-హిందువులు కారా ?

ఎందుకు కాం దొర-అయితం

-మీ ఎలక్షన్‌ లెక్కలల్ల అయితం !

ఏం తింటార్రా మీరూ ?

దళితులు తినేవన్నీ తింటం నాయిన

అవే, ఏమేం తింటరు ?

మీతో దెబ్బలు తింటం

అప్పుల బాదలు తింటం

మీ తొక్కిసలాటల, మేం తన్నులు తింటం,

ఎప్పుడన్న మీరేశిన తొక్కు దింటం -బాంచెన్‌ !

కోళ్ళు తింటరేమో ననుకున్నారా ?

తింటాం గద దొర ! మీ ఎలక్షన్‌ టయిముల-

ఏమేం తాగుతర్రా మీరూ ?

దళితులు తాగేవే తాగుతమయ్య

అవే – ఏమిటవి ?

అంటరాని నీల్లు తాగుతం

ఇరిగిన కోర్కెల ఇషం తాగుతం

రేపనేది లేని చీకటి తాగుతం

బీరు-బ్రాంది తాగుతారేమోననుకున్నారా ?

తాగుతం కద నాయిన -మీ ఎలక్షన్లప్పుడు-

మీకేం దొరుకుతయిరా ?

దళితులకు దొరికేవన్నీ దొరక్తయి దొర

అంటే-అదే ఏమేం దొరుకుతయి ?

మీరు ఒదిలేసిన మురికి

ఊరొదిలేసి చివరికి

అందుకున్న కొసప్రానాలు ఉరికి

అదేమిటీ ? ఆశలేవీ దొరకవా ?

దొరుక్తయి కద దొర-మీ ఎలక్షన్లప్పుడు-

ఇంతకీ మీరు చేసిన పనేంట్రా ?

దళితులు చేసే పనులన్నీ చేశినం దొర

అదే-ఏమేం చేశారు ?

వంద రోజులు చెరువు పని చేశినం

మా చెమటల్తో దాన్ని నింపేశినం

పగలంత పని చేసి, దాన్నే రాత్రి చేసినం

రాత్రంత పని చేసి, దాంతోనే పొద్దు పొడిపించినం

అవునా ? ఇంకేమేం చేశార్రా ?

ఆ దారిన ఒచ్చిపోయే మీ దొరలందరికీదండాలు పెడ్తం కద నాయిన ?

అంతేనా ? ఇంకా ఏదో పెద్ద పని చేశారనుకున్నానే ?

చేశినం కద దొర-మీ ఎలక్షన్‌ ప్రచారం !

అంతకు మించి మాకు, మరో పెద్ద పనేముంటదయ్యా

బాంచెన్‌ నీ కాల్‌ మొక్త… హిందీ మూలం : బచ్చాలాల్‌ ఉన్మేష్‌ తెలుగు :డా|| దేవరాజు మహారాజు

➡️