కరగపాడులో పెద్దపులి తిష్ట

Feb 3,2024 21:18 #East Godavari, #Tiger

ప్రజాశక్తి-గోపాలపురం :ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా తిష్ట వేసింది. దీంతో రైతులు, గ్రామస్తుల భయాందోళనకు గురవుతున్నారు. డిఎఫ్‌ఒ నాగరాజు మాట్లాడుతూ కరకపాడు పొలాల్లో రైతు పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసి చంపిందని, పందిని తాడుతో కట్టడం వల్ల పులి తీసుకెళ్లలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం కరకపాడు అటవీ ప్రాంతంవైపు పాద ముద్రలు ఉన్నాయని తెలిపారు. ఈ అటవీ ప్రాంతం ద్వారా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. చుట్టుపక్కల గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 9 గంటల వరకు రైతులు పొలం పనులకు వెళ్లవద్దని, పశువులను ఇళ్ళ వద్దకు చేర్చుకోవాలని సూచించారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇంటికే పరిమితమవ్వాలని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పులి జాడ చిక్కిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఏలూరు, జంగారెడ్డిగూడెం సబ్‌ డిఎఫ్‌ఒ, ఎఫ్‌ఆర్‌ఒలు ధనరాజు, దావీదురాజు, డైఆర్‌ఒ వేణుగోపాల్‌, ఎఫ్‌బిఒలు కార్తీక్‌ పాల్గొన్నారు.

➡️