Japan లో భూకంపం – అణు విద్యుత్తు ప్లాంట్‌ మూసివేత

జపాన్‌ : జపాన్‌లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. ఫలితంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా… అక్కడ ఉన్న అణు విద్యుత్తు ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. 2011లో వచ్చిన సునామీ కారణంగా ఇది తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

” ప్రస్తుతం ఏఎల్‌పీఎస్‌ ట్రీటెడ్‌ వాటర్‌ డిశ్చార్జి కేంద్రంలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్లాంట్‌ను మూసివేశాం” అని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) శుక్రవారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఈ నిర్ణయంతో దైచీ అణు విద్యుత్తు కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఇక్కడ ఎలాంటి రేడియేషన్‌ లీకులను గుర్తించలేదని టెప్కో చెబుతోంది. మానిటరింగ్‌ పోస్టులో రీడింగ్స్‌ కూడా సాధారణంగా ఉన్నట్లు పేర్కొంది. గతేడాది ఆగస్టులో టెప్కో ఇక్కడి నుంచి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను మెల్లగా పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం ప్రారంభించింది. ఈ కేంద్రంలో 540 ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌కు సమానమైన జలాలున్నాయి. 2011 ప్రమాదం తర్వాత దైచీ అణు కేంద్రం నుంచి వీటిని సేకరించారు. జపాన్‌ ఏటా వందల కొద్దీ భూకంపాలను ఎదుర్కొంటోంది.

➡️