వాయు కాలుష్య పరిమితులపై ఇయు కొత్త నిబంధనలు

ఉల్లంఘిస్తే ఇక చట్టపరమైన చర్యలే
బ్రస్సెల్స్‌ : వాయు కాలుష్య పరిమితులను విధిస్తూ యురోపియన్‌ పార్లమెంట్‌ బుధవారం కొత్త నిబంధనలు రూపొందించింది. 2030కల్లా తప్పనిసరిగా వీటిని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గతేడాది గాలి నాణ్యతకు సంబంధించి తన మార్గదర్శకాలను కట్టుదిట్టం చేసింది. పరిశుద్ధమైన గాలిని అందించే దిశగా దేశాలు చర్యలు తీసుకున్నప్పుడే వాయు కాలుష్యం వల్ల సంభవించే మరణాలను నివారించగలుగుతామని పేర్కొంది.
ప్రతి ఏటా యూరప్‌లో వాయు కాలుష్యం వల్ల మూడు లక్షల మంది చనిపోతున్నారు. ఇయు మరింత కఠినమైన నిబంధనలను అమలు చేయడం వల్ల రానున్న పదేళ్ళలో ఈ సంఖ్య 70శాతం తగ్గుతుందని ఇయు పర్యావరణ కమిషనర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్ళ కాలంలో యూరప్‌లో గాలి నాణ్యత మెరుగుపడింది. కానీ పరిమితులను ఉల్లంఘించారనే కారణంతో పదికి పైగా దేశాలపై ఇయు చర్యలు తీసుకుని కోర్టుకీడ్చింది. వీటిలో ఫ్రాన్స్‌, పోలెండ్‌, ఇటలీ, రొమేనియా తదితర దేశాలు వున్నాయి. కొత్తగా విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే వాయు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నవారు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు వుంది. వారి ఆరోగ్యం దెబ్బతింటే పౌరులు నష్టపరిహారం కూడా పొందవచ్చు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టం ఇదని ఇయులో స్పానిష్‌ సభ్యుడు జావి లోపెజ్‌ వ్యాఖ్యానించారు.

➡️