నకిలీ ఔషధ రాకెట్‌ కేసులో ఇడి ముమ్మర దాడులు

Mar 19,2024 00:30 #ED, #ED raids, #fake medicine, #racket case
  •  14 బ్యాంక్‌ ఖాతాల సీజ్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్‌ వెలుగుచూడటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్‌ జైన్‌, నీరజ్‌ చౌహన్‌, సూరజ్‌ షాత్‌, అభినవ్‌, తుషార్‌ చౌహాన్‌లతో సహా వారి సహచరుల ఇళ్లల్లో దాడులు నిర్వహించింది. రెండు ప్రదేశాల్లో సుమారు రూ.65 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సూరజ్‌ షాత్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.23 లక్షలు గుర్తించారు. నిందితుడి ఇంటి నుంచి చర, స్థిరాస్తులకు సంబంధించిన వివరాలతోపాటు నేరారోపణ పత్రాలను ఏజెన్సీ స్వాధీనం చేసుకొంది.
ఢిల్లీ పోలీసులు నకిలీ క్యాన్సర్‌ మందులు తయారుచేసి, సరఫరా చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రి ఉద్యోగులుగా గుర్తించారు. గత రెండేళ్లుగా వీరు ఈ ఔషధ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా రూ.100 విలువ చేసే యాంటీ-ఫంగల్‌ మెడిసిన్‌ను ఖాళీ వయల్స్‌లో నింపి.. దాన్ని క్యాన్సర్‌ ఔషధంగా మార్కెట్లో ఒక్కో వయల్‌ను రూ.లక్షల్లో విక్రయించారని, ఇప్పటివరకు ఏడు వేలకు పైగా ఇంజెక్షన్లను అమ్మారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారులు విపిల్‌ జైన్‌, నీరజ్‌ చౌహన్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ నకిలీ ఔషధాలను రోగులకు చేరవేయడంలో నిందితులకు సహకరిస్తున్న మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరిని న్యూ మోతీనగర్‌ నివాసి రోహిత్‌ సింగ్‌ బిష్త్‌ (36), హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన జితేంద్ర (33), మాజిద్‌ ఖాన్‌ (34), సాజిద్‌ (33)గా గుర్తించారు.
రోహిత్‌ సింగ్‌ ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో కీమోథెరపీ యూనిట్‌లో డేకేర్‌ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాడని, జనరల్‌ నర్సింగ్‌లో డిప్లొమా చేసిన అతనికి కీత్రుడా, ఒప్డిటా వంటి క్యాన్సర్‌ రోగులు వాడే ఇంజెక్షన్‌లపై అవగాహన ఉండడంతో వాటిని ఒక్కోటి రూ.35,000 నుంచి రూ.65,000లకు విక్రయించేవాడని అధికారి పేర్కొన్నారు. నిందితుల నుంచి ఖాళీ సిరంజీలు, రెండు ఒప్డిటా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిందితులకు చెందిన 14 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసిన పోలీసులు అందులో ఉన్న మరో రూ.92.81 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలియజేశారు.

➡️