ED : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ రూ. 82-12 కోట్ల ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ : పారాబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన బ్యాంకు మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) రూ.82.12 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద సంస్థకు చెందిన డైరెక్టర్లు, ఇతరుల చరాస్తులతో పాటు 24 స్థిరాస్తులను కూడా జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రణవ్‌ గుప్తా, వినీత్‌ గుప్తా, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సుర్జీత్‌ కుమార్‌ బన్సాల్‌ సహా వారి కుటుంబసభ్యుల క్రైమ్‌ ప్రొసీడ్స్‌ (పిఒసి)కి సంబంధించినవని ఇడి అధికారులు పేర్కొన్నారు.

1988లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) పారబోలిక్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ ప్రమోటర్‌- డైరెక్టర్లు ప్రణవ్‌, వినీత్‌, ఇతరులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ విచారణ జరిగినట్లు ఇడి తెలిపింది. గతేడాది చివరలో వారిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2009 -2014 మధ్య సెంట్రల్‌ బ్యాంక్‌ సహా ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలను రూ. 1,626.70 కోట్ల మేర మోసం చేసినట్లు పేర్కొంది.

గతంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వారితో పాటు ఎంట్రీ ఆపరేటర్స్‌కు చెందిన చంఢగీఢ్‌, అంబాలా, పంచకుల, సోన్‌పేట్‌, ముంబయి, ఢిల్లీల్లో సోదాలు చేపట్టినట్లు తెలిపింది.

➡️