పండుగల వేళ…

Apr 7,2024 08:22 #Food Care, #Sneha

ఈ వారంలో రంజాన్‌, ఉగాది పండుగలు వెంటవెంటనే వచ్చాయి. మత సామరస్యం గల మన ప్రాంతంలో ముస్లిం కుటుంబాల వారు ఇరుగుపొరుగు వారికి హలీమ్‌ పెడితే… హిందువులు ఉగాది పచ్చడి పంచుతారు. ఈ సందర్భంగా ఇంటికి వచ్చిన అతిధులకు, కుటుంబసభ్యులకు ప్రత్యేకమైన స్వీట్లు చేసి పెడితే.. పండుగలు మరింత గుర్తుండిపోతాయి. పండగ ఏదైనా ఎక్కువగా పప్పు పూర్ణం బూరెలనే తయారు చేస్తూ ఉంటాము. కానీ నువ్వులు, కొబ్బరి స్టఫింగ్‌తో చేసే బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దీంతోపాటు మటన్‌ హలీమ్‌ చేసుకుంటే బాగుంటుంది. వీటిని చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

మటన్‌ హలీం
కావాల్సినవి : మటన్‌ ఖీమా – అరకిలో, మినప్పప్పు – అరకప్పు, పెరుగు – ఒక కప్పు, జీడిపప్పు – పావు కప్పు, నెయ్యి – పావు కప్పు,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – రెండు స్పూన్లు, కారం – అర స్పూను, పుదీనా ఆకులు – పావు కప్పు, గోధుమలు – ఒకటిన్నర కప్పు, పసుపు – పావు టీ స్పూన్‌, ఉల్లిపాయ – ఒకటి, శనగపప్పు – అర కప్పు, దాల్చిన చెక్క – చిన్న ముక్క , కొత్తిమీర తరుగు – అరకప్పు, పచ్చిమిర్చి – మూడు, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మకాయ – ఒకటి, గరం మసాలా – అర స్పూను.
తయారీ : గోధుమల్ని బరకగా మిక్సీ పట్టీ అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. మటన్‌ ఖీమాకు అల్లం వెల్లుల్లి పేస్టు కారం, ఉప్పు, గరం మసాలా పసుపు వేసి కలుపుకోవాలి. దీన్ని కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి, పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్‌ పై పెద్ద గిన్నె పెట్టి గోధుమ నూకలను వేయాలి. అందులో మినప్పప్ప, శెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొన్ని మిరియాలు వేసి పది కప్పుల నీళ్లు పోసి చిన్నమంట మీద బాగా ఉడికించాలి. పేస్టులా అయ్యేవరకూ మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్‌ కట్టేయాలి. ఇప్పుడు మరొక గిన్నె స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడిచేయాలి. మెత్తగా ఉడికించిన మటన్‌ ఖీమా, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా వేసి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పెరుగు వేసి, మూత పెట్టి పావుగంట పాటు ఉడికించాలి. అందులో మరో మూడు కప్పులు నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. దీనిలో గోధుమ మిశ్రమాన్ని, నెయ్యి వేసి కలపాలి. స్టవ్‌ సిమ్‌లో పెట్టి అరగంట పాటు ఉడికించాలి. బాగా ఉడికాక స్టవ్‌ కట్టేయాలి.
ముందుగా ఉల్లిపాయ తరుగును వేయించి పెట్టుకోవాలి. దీన్ని హలీంపై చల్లుకోవాలి. తినాలనిపిస్తే నిమ్మ రసాన్ని కూడా పిండుకొని, కొత్తిమీర, పుదీనా తరుగును వేసి గార్నిష్‌ చేసుకోవాలి. తింటే చాలా రుచిగా ఉంటుంది.

కొబ్బరి, నువ్వులతో

కావల్సినవి : బియ్యం – కప్పు, మినపప్పు – అర కప్పు, పచ్చికొబ్బరి తురుము – 3 కప్పులు, నువ్వుల పొడి- ఒక కప్పు, బెల్లం తురుము- ఒక కప్పు, పుట్నాల పొడి – 2 టీ స్పూన్స్‌, యాలకుల పొడి – అర టీ స్పూన్‌, నెయ్యి – ఒక టీ స్పూన్‌, ఉప్పు – చిటికెడు, వంటసోడా – చిటికెడు, నూనె- డీప్‌ ఫ్రైకు సరిపడా.
తయారీ : ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు శుభ్రంగా కడగి, తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. వీటిని జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కళాయిలో పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, నువ్వులపొడి వేసికలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగి కొద్దిగా దగ్గర పడిన తరువాత పుట్నాల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి.
ముందుగా చేసుకున్న పిండిలో ఉప్పు, వంటసోడా, కొద్దిగా నీళ్లు పోసి పూర్ణాలకు సరిపడా పిండి కలుపుకోవాలి. కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై చక్కగా వేయించుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే కొబ్బరి, నువ్వుల పూర్ణం బూరెలు రెడీ. ఈవిధంగా తయారు చేసిన బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

➡️