గ్రేడ్‌లు, ర్యాంకులే కాదు.. ఆటపాటలూ ముఖ్యమే

duggirala balotsavam mlc ks

– బాలోత్సవంలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):విద్యార్థులకు ర్యాంకులు, గ్రేడ్‌ పాయింట్లే ముఖ్యం కాదని, వారిలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం అనివార్యమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులోని కాట్రగడ్డ వెంకటసుబ్బయ్య ఉన్నత పాఠశాల్లో బుధవారం బాలోత్సవం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సూర్యదేవర సంజీవ్‌దేవ్‌ వేదికపై బాలోత్సవం కమిటీల రాష్ట్ర సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ బి.లలితానందప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విద్యా రంగంలో రోజురోజుకూ పెనుమార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్‌ రంగంలో అపార్ట్‌మెంట్లే తరగతి గదులని, కనీసం క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గ్రేడు, పాయింట్లు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బాలలకు కొంత ఆటవిడుపు కోసమే బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలోత్సవం వేదికగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆసక్తి కలిగిన రంగంలో ప్రోత్సహించేందుకు వీలుంటుందని తెలిపారు. ఎంఇఒ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల దశలోనే విద్యార్థులు ఒక ప్రత్యేకమైన అభిరుచి కలిగి ఉంటారని, దానిని గమనించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల శాశ్వత ట్రస్టీ కాట్రగడ్డ నారాయణరావు, చిలువూరు రంగిశెట్టి ఫౌండేషన్‌ సభ్యులు రంగిశెట్టి రమేష్‌, మండల విద్యాధికారి-2 ఎం.లక్ష్మినారాయణ, గ్రామ సర్పంచ్‌ చిలువూరు మాణిక్యమ్మ, నిర్వాహక కమిటీ సభ్యులు గాదె సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

 

➡️