తేరుకుంటున్న దుబాయ్

Apr 18,2024 00:09 #dubai, #heavy rains

దుబాయ్ : మేఘ మథనం చేస్తే కానీ వర్షాలు కురవని దుబారు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలతో నివాస ప్రాంతాలు, రహదారులు, ప్రయాణ ప్రాంగణాలు జలాశయాలను తలపించాయి. మోకాలు లోతు నీటితో ప్రజలు అవస్థలు పడ్డారు. అనేక విమాన సర్వీసులు, ఇతర ప్రయాణ వాహన సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) వరదనీటిలో చిక్కుకుంది. మంగళవారం రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బుధవారం నుంచి సహాయక చర్యలు, శిధిలాల తొలగింపు వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా తేరుకుంటోంది. మంగళవారం వర్షాల్లో వాహనం చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందగా, ఇళ్లు, వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలను తట్టుకునే డ్రైనేజీ సదుపాయాలు తక్కువగా ఉండటంతో చిన్నపాటి వర్షాలకే రోడ్లు మునిగిపోతుంటాయి. ఇక మంగళవారం రికార్డు స్థాయి వర్షాలకు రహదారులు భారీ నదులను తలపించాయి. రోడ్డు రవాణాతో పాటు విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. సర్వీసులు రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణీకులు విమానాశ్రయాల్లోనే ఇబ్బందులు పడుతున్నారు.
ఏడాదిన్నరలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లోనే కురిసిందని యుఎఇ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. యుఎఇ-ఒమన్‌ సరిహద్దులో ఉన్న అల్‌ ఐన్‌ అనే నగరంలో 24 గంటల్లోపే 254 మీమీ (10 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. 1949లో రికార్డుల నమోదైనప్పటి నుంచి ఇదే అత్యధిక వర్షపాతం. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల కారణంగానే యుఎఇ వంటి ఎడారి దేశాల్లో భారీ వర్షాలు వంటి వాతావరణ సంఘటనలకు దారి తీస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. యుఎఇకి సమీప దేశమైన ఒమన్‌లో భారీ వర్షాలు ముంచెత్తాయి. మూడు రోజుల పాటు కురిసిన ఈ వర్షాల్లో 19 మంది మరణించారు.

➡️