12న డిఎస్‌సి నోటిఫికేషన్‌

Feb 7,2024 15:30 #minister bostha, #press meet

– పోస్టులు 6,100- రేపు టెట్‌ నోటిఫికేషన్‌

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి బొత్స

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఈ నెల 12న విడుదలవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అలాగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ ఈ నెల 8న విడుదలవుతుందని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌, ఉన్నత విద్యాశాఖ కమిషనరు పోలా భాస్కర్‌తో కలిసి డిఎస్‌సి, టెట్‌ షెడ్యూల్‌ను బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో ఏడు యాజమాన్యాలు కింద ఉన్న 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. 2024 ఏప్రిల్‌ నాటికి ఖాళీ అయ్యే ఖాళీలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తామన్నారు.ఎస్‌జిటి 2,280, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎ) 2,299, టిజిటి 1,264, పిజిటి 215, ప్రిన్సిపల్‌ పోస్టులు ఉన్నాయని వివరించారు. 14,219 టీచర్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిందని చెప్పారు. సున్నా ఖాళీలు అనే విధానంతో ప్రతియేటా ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. డిఎస్‌సి-2018కు ఉన్న వయోపరిమితి 44 ఏళ్లే ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్‌లో నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా ముగిసిన తరువాత విరమణ చేసే అంశంపై ఆలోచన చేస్తున్నామని తెలిపారు. టెట్‌, డిఎస్‌సి షెడ్యూల్‌ తేదీలను ప్రవీణ్‌ ప్రకాష్‌, సురేష్‌ కుమార్‌ వివరించారు. cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా టెట్‌, డిఎస్‌సికి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాల వారీ ఖాళీల వివరాలను రిజర్వేషన్లతో సహా నోటిఫికేషన్‌లో పొందుపరుస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఫిర్యాదుల నివృత్తికి ఈ నెల 8 నుంచి విద్యాశాఖ కమిషనరు కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ జాయింట్‌్‌ డైరెక్టర్లు ఎం రామలింగం, మేరీ చంద్రిక, ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు.

 

ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్‌ రిలీజ్‌తో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome

ఏపీ డీఎస్సీ ముఖ్యమైన తేదీలు :

  • ఫిబ్రవరి 12 : దరఖాస్తుల స్వీకరణ
  • మార్చి 5 : హాల్ టికెట్ల డౌన్‌లోడ్
  • మార్చి 31 : ప్రాథమిక కీ విడుదల
  • ఏప్రిల్ 1 :  కీ పై అభ్యంతరాల స్వీకరణ
  • ఏప్రిల్ 2 : ఫైనల్ కీ విడుదల
  • ఏప్రిల్ 7 : డీఎస్సీ ఫలితాలు విడుదల

రేపట్నుంచే టెట్‌ దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 8వ తేదీ నుంచి టెట్‌ ప్రక్రియ (నోటిఫికేషన్‌తో) ప్రారంభం అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీల్లో  https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.

ఏపీ టెట్‌ ముఖ్యమైన తేదీలు :

  • ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • 19వ తేదీన ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు.
  • 23 వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌
  • 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్‌ పరీక్షలు
  • ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది.
  • ఫైనల్‌ కీ మార్చి 13వ తేదీన రిలీజ్‌ చేస్తారు.
  • మార్చి 14వ తేదీన టెట్‌ తుదిఫలితాలు వెలువడతాయి.
➡️