డ్రగ్స్‌ పాలిట్రిక్స్‌!

Mar 26,2024 06:38 #Articles, #Drugs, #edite page, #port, #vizag

విశాఖ పోర్టులో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల పట్టివేత దేశాన్నే ఉలికిపాటుకు గురి చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా మన నట్టింటి దాకా రావడం ఆందోళనకరంకాగా, దీనిలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రమేయం ఉందన్న విమర్శలు బ్లాస్ట్‌ కావడం కల్లోలం రేపుతున్నాయి. బ్రెజిల్‌లో శాంతోస్‌ పోర్టు నుంచి జనవరి 14న బయలుదేరిన నౌక జర్మనీ మీదుగా వైజాగ్‌ పోర్టుకు ఈ నెల 16న చేరుకొని, స్థానిక సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బుక్‌ అయిన కంటైనర్‌ను దించి వెళ్లిపోయింది. కంటైనర్‌లో నిషేధిత డ్రగ్స్‌ ఉన్నాయని ఇంటర్‌పోల్‌ ద్వారా మన దేశాన్ని అప్రమత్తం చేశారు. సిబిఐ, కస్టమ్స్‌ అధికారులు విశాఖకొచ్చి కంటైనర్‌ను పరిశీలించి నార్కోటిక్‌ పరీక్షలు చేసి అత్యంత ప్రమాదకర కొకైన్‌, హెరాయిన్‌ వంటి మత్తు పదార్ధాలున్నట్లు గుర్తించి నిర్ధారణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు రావడానికి రెండు వారాలు పడుతుందంటున్నారు. కంటైనర్‌లో రొయ్యల మేతకు ఉపయోగించే డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్‌ మిక్స్‌ చేశారన్నది అభియోగం. వెయ్యి బస్తాల్లోని 25 వేల కిలోల డ్రైడ్‌ ఈస్ట్‌లో ఐదు వేల కిలోల డ్రగ్స్‌ మిక్స్‌ అయ్యాయని అంచనా. విలువ రూ.లక్ష కోట్లకు పైమాటేనంటున్నారు.
యువతను నిర్వీర్యం చేసే మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసే డేంజరస్‌ డ్రగ్స్‌ నిరోధానికి కేంద్ర సంస్థల్లో సాచివేత తిష్ట వేసిందనడానికి విశాఖ ఉదంతమే ఉదాహరణ. ఇంటర్‌పోల్‌ చెప్పాక కూడా సకాలంలో కదల్లేదు. 16న పోర్టుకు వచ్చిన ఓడ కంటైనర్‌ను స్వేచ్ఛగా దించేసి తమిళనాడు వెళ్లిపోయింది. దర్యాప్తు సంస్థలు తీరిగ్గా 18న విశాఖ వచ్చాయి. ఎందుకు రెండు రోజులు ఆలస్యమైందో ఆ సంస్థలే చెప్పాలి. వచ్చాక కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల, పోర్టు ఉద్యోగుల ఆటంకాల వలన దర్యాప్తులో జాప్యం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ పేర్కొంది. విశాఖ పోర్టు కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర అధికారులు, పోర్టు ఉద్యోగులు దర్యాప్తును అడ్డుకుంటుంటే సిబిఐ చోద్యం చూసిందెందుకు? దీనిపై విశాఖ పోలీస్‌ కమిషనర్‌ సాంకేతిక అంశంగా కొట్టిపడేశారు. సంధ్యా సంస్థపై సిబిఐ దాడులు చేసిందంటుండగా, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి వద్ద మూడు రోజులుగా నిలిపిన ఆ సంస్థ బస్సును ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రజలు సమాచారం ఇచ్చాకనే కదిలారు. డ్రగ్స్‌ పట్టుబడి ఐదు రోజులవుతున్నా సిబిఐ దర్యాప్తు వీసమెత్తు కదలకపోవడంతో అనుమానాలు కలగడం సహజం.
సంధ్యా సంస్థ ఓనర్లతో చంద్రబాబు, లోకేష్‌, పురందేశ్వరికి సంబంధ బాంధవ్యాలున్నాయని అధికార వైసిపి ఆరోపిస్తోంది. వైసిపి నేతలకే ఆ సంస్థ ప్రతినిధులతో మైత్రి బంధాలున్నాయని టిడిపి ప్రత్యారోపణలకు దిగింది. టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన పరస్పర నిందాపర్వంతో డ్రగ్స్‌ వ్యాపారంలో ఆ నాలుగు పార్టీల నేతలకు సంబంధాలున్నాయని తేటతెల్లమౌతోంది. మధ్యలో బ్రిజిల్‌ అధ్యక్షుడు, వామపక్షవాది లూలాను లాగడంపై అసహ్యమేస్తోంది. ఇటీవలి కాలంలో ఎ.పి. గంజాయికి, డ్రగ్స్‌కు, అక్రమ మద్యానికి ఆలవాలంగా మారిందని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి. రెండేళ్ల కింద అఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడ చిరునామాపై గుజరాత్‌ ముంద్రా పోర్టుకు వచ్చిన భారీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఆ కేసు ఏమైందో తెలీదు. ముంద్రా పోర్టు అదానీ చేతిలో ఉంది. విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ దిగింది ముంబయికి చెందిన జెఎస్‌ బక్షి గ్రూపునకు చెందిన బెర్త్‌లోనే. ప్రైవేటు కంపెనీలు నిర్వహించే పోర్టులకు డ్రగ్స్‌ రావడం చూస్తున్నాం. అక్కడ చెకింగ్స్‌ ఉండవనే. విశాఖ పోర్ట్‌ను అదానీ శాసిస్తున్నారు. సర్కారు అండతో గంగవరం వశం చేసుకున్నారు. ప్రైవేటు పోర్టులు డ్రగ్స్‌కు, అక్రమ ఆయుధ వ్యాపారాలకు అడ్డాలుగా మారుతున్నాయనడానికి పలు ఉదంతాలున్నాయి. విశాఖ వంటి మేజర్‌ పోర్టును ప్రైవేటీకరిస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. విశాఖ డ్రగ్స్‌పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. నిష్పాక్షికత కొరవడితే ప్రజలు నమ్మరు. ప్రమాదకర డ్రగ్స్‌ దందా ఆగదు. దేశానికి పెనుముప్పు వాటిల్లుతుంది.

➡️