పామర్రులో నీట మునిగిన ధాన్యం రాశులు : పరిశీలించిన మంత్రి వేణు

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తొలకరి ధాన్యం రాశులు నీట మునిగాయి. ఆరుగాలం కష్టంచి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకునేందుకు సిద్ధమయ్యే సమయంలో తుపాను వల్ల రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఎగుమతులు నిలిచిపోగా ధాన్యం రాశుల్లోకి నీరు చేరింది. పామర్రు పరిసర ప్రాంతాల్లో పంట పండించిన రైతులు ఇక్కడ హై స్కూల్‌ గ్రౌండ్‌ లో ధాన్యం రాశులుగా పోసి నిలవచేసుకున్నారు. అయితే భారీ వర్షాలకు హైస్కూల్‌ గ్రౌండ్లోకి నీరు చేరడంతో ధాన్యం రాశులు మొత్తం ముంపునకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం ఉదయం పామర్రు హై స్కూల్‌ గ్రౌండ్‌ కు చేరుకుని తడిసిన ధాన్యం రాశులను పరిశీలించారు. అనంతరం ఇక్కడ రైతులతో మంత్రి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దు అని మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. ఇప్పటికే మిల్లర్లకు తడిసిన ధాన్యం పై పలు సూచనలు చేశామని ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట కే.గంగవరం, తహశీల్దార్‌ వైద్యనాథ్‌ శర్మ, పలువురు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️